స్వదేశానికి దూరమైపోతున్న సంపన్నులు..

Update: 2018-02-04 23:30 GMT
దేశీయ మిలియనీర్లు.. విదేశీ బాట పడుతున్నారు. వ్యాపారం కోసం మాత్రం కాదు. కుటుంబసమేతంగా పర్యాటక యాత్ర అంతకన్నా కాదు. మరెందుకు అనుకుంటున్నారా?.. అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకోవడానికి. అవును.. పరాయి దేశానికి భారతీయ సంపన్నులు వలసపోతున్నారు. ఆందోళనకర విషయమేమిటంటే.. ఇలా వెళ్లిపోతున్నవారి సంఖ్య ఏటా పెరుగుతుండటం. గతేడాది 7,000 మంది భారతీయ ధనవంతులు విదేశాలకు వెళ్లిపోగా, అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 6,000గా ఉంది. 2015లో 4,000 మందిగా ఉంటే, రెండేళ్ల‌లో 3,000 మంది పెరుగడం గమనార్హం. నిరుడు విదేశాలకు వలసపోయిన సంపన్నుల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. 10,000 మందితో చైనా మొదటి స్థానంలో ఉన్నట్లు న్యూ వరల్డ్‌ వెల్త్‌ తాజా నివేదిక స్పష్టం చేసింది. ఈ జాబితాలో టర్కీ (6,000) మూడో స్థానంలో ఉండగా, ఆ తర్వాత బ్రిటన్‌ (4,000) - ఫ్రాన్స్‌ (4,000) - రష్యా (3,000) దేశాలు ఉన్నాయి.

ఇకపోతే భారతీయ మిలియనీర్లు అత్యధికంగా వలస వెళ్తున్న దేశం అగ్రరాజ్యం అమెరికానే. ఆ తర్వాత యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) - కెనడా - ఆస్ట్రేలియా - న్యూజీలాండ్‌ దేశాల్లో స్థిరపడుతున్నారు. చైనా కుబేరులు సైతం అమెరికానే ఎంచుకుంటుండగా - కెనడా - ఆస్ట్రేలియా దేశాలకు ఆ తర్వాతి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినప్పటికీ భయపడనక్కర్లేదంటున్నది న్యూ వరల్డ్‌ వెల్త్‌. భారత్‌ - చైనాల నుంచి వెళ్లిపోతున్న మిలియనీర్ల కంటే కొత్తగా ఈ దేశాల్లో పుట్టుకొస్తున్న మిలియనీర్ల సంఖ్యే ఎక్కువగా ఉంటున్నదని, కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ రెండు దేశాలకు మిలియనీర్ల వలసలతో వచ్చిన ముప్పేమీ లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. అంతేగాక స్వదేశాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడితే దూరమైన సంపన్నులు తిరిగి వస్తారన్న విశ్వాసాన్నీ వెలిబుచ్చింది.

ఇదిలావుంటే వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు అత్యధికంగా మిలియనీర్లు వలస పోతున్నారు. గతేడాది 10,000 మంది సంపన్నులు ఆయా దేశాల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడినట్లు తేలింది. అంతకుముందు అమెరికాకే ఎక్కువగా వలసలుండేవి. అయితే 2015 నుంచి ఈ పరిస్థితి మారింది. కాగా, గడిచిన పదేండ్లకుపైగా కాలంలో ఆస్ట్రేలియాలోని మొత్తం సంపద 83 శాతం ఎగబాకింది. ఇదే సమయంలో అమెరికా సంపద 20 శాతమే పెరిగినట్లు కనిపిస్తున్నది. ఫలితంగా సగటు అమెరికా పౌరుడి కంటే.. ఇప్పుడు ఆస్ట్రేలియా పౌరుడే సంపన్నుడు. పదేళ్ల‌కు ముందు ఇలా ఉండేది కాదంటున్నది న్యూ వరల్డ్‌ వెల్త్‌. ఇక 2017లో అమెరికాకు 9,000 మంది మిలియనీర్లు విదేశాల నుంచి రాగా, ఆ తర్వాత ఎక్కువగా కెనడా (5,000) - యూఏఈ (5,000) దేశాలకు వెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా స్వదేశాలను వీడి విదేశాలకు వలసపోయిన మిలియనీర్ల సంఖ్య గతేడాది దాదాపు 95,000గా నమోదైంది. 2016లో 82,000 - 2015లో 64,000గా ఉందని తాజా నివేదికలో న్యూ వరల్డ్‌ వెల్త్‌ తెలియజేసింది.

న్యూ వరల్డ్‌ వెల్త్‌ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..

సంపన్న దేశాల్లో రూ.5,34,95,000 కోట్లతో భారత్‌కు ఆరో స్థానం

భారత్‌లో రూ.6.5 కోట్లు అంతకంటే ఎక్కువ నికర ఆస్తులున్న సంపన్నులు 3,30,400 మంది

ఈ విషయంలో ప్రపంచ దేశాల్లో భారత్‌కు 9వ స్థానం

భారత్‌లో రూ.13 కోట్లు అంతకంటే ఎక్కువ సంపద కలిగిన మల్టీ మిలియనీర్లు 20,730 మంది

ఇందులో ప్రపంచంలోనే భారత్‌ 7వ అతిపెద్ద దేశం

రూ.6,500 కోట్లు అంతకంటే ఎక్కువ కలిగిన బిలియనీర్లు భారత్‌లో 119 మంది

అమెరికా, చైనా తర్వాత అత్యధికంగా బిలియనీర్లున్నది భారత్‌లోనే
Tags:    

Similar News