షాకింగ్: వర్షాల ధాటికి ఒకే కుటుంబంలో 8 మంది గల్లంతు

Update: 2020-10-14 17:00 GMT
ఇరు తెలుగు రాష్ట్రాలను ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మంగళవారం మధ్యాహ్నం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షం తీవ్రతకు జనజీవనం స్తంభిచింది. నగరంలోని చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీటమునిగాయి. వరదనీరు, భారీ వర్షాల ధాటికి బండ్లగూడలో 8 మంది, ఇబ్రహీంపట్నంలో ఇద్దరు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మైలార్‌దేవ్ పల్లి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది అకస్మాత్తుగా పోటెత్తిన వరదనీటిలో కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభించగా..మిగతా వారి జాడకోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలకు చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌ ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఈ ప్రాంతాలకు సమీపంలోని పల్లచెరువు నిండి కట్ట తెగడంతో చాంద్రాయణ గుట్ట, ఆరాంఘర్‌ మధ్యన ఉండే బండ్లగూడ దగ్గర రహదారి ధ్వంసమయింది.

గత 20ఏళ్లలో హైదరాబాద్‌లో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. హుస్సేన్ సాగర్‌లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. హిమాయత్ సాగర్ కు 16 వేల 600 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. అందులోని నీటి మట్టం 1762.867 అడుగులకు చేరుకుంది. భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బుధ, గురువారాలు(14, 15 అక్టోబరు) సెలవు ప్రకటించారు. అత్యంత అవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల తాకిడికి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ స్థాయిలో వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
Tags:    

Similar News