వరల్డ్ అప్డేట్: 82వేల కరోనా మృతులు.. 14.31లక్షల బాధితులు

Update: 2020-04-08 06:30 GMT
కరోనా మరణ మృదంగం వినిపిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఏకంగా 82వేలు దాటింది. ఒక్క అమెరికాలోనే 4లక్షలకుపైగా బాధితులు పెరిగిపోయారు.  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 208 దేశాలకు కరోనా పాకింది. యూరప్, అమెరికాలో తీవ్రంగా ఉంది.
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 14.31 లక్షలు దాటింది. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా 82వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 47వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 7వేల మంది వైరస్ బారిన పడ్డారు.
 
ఫ్రాన్స్ లో మంగళవారం ఒక్కరోజే 1400మందికి పైగా మరణించారు. స్పెయిన్ లో ఒక్కరోజులో 743మంది ప్రాణాలు కోల్పోయారు.ఇటలీలో మంగళవారం మళ్లీ కరోనా వైరస్ తీవ్రత పెరిగింది.  చైనాలో మంగళవారం ఒక్కరూ కూడా చనిపోలేదు.

బ్రిటన్ లో ప్రధాని బోరిస్ కు కరోనా విషమించడంతో ఐసీయూకు తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇక బ్రిటన్ లో భారతీయ సీనియర్ వైద్యుడు జితేంద్ర కుమార్ కరోనాతో మృతి చెందారు.

అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య  పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య 12858కు చేరింది. న్యూయార్క్ లో మంగళవారం 731 మంది చనిపోయారు.  అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 4 లక్షలకు చేరింది. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో ఏకంగా 1845మంది మరణించడం కలకలం రేపింది. ఇవే ఒక్కరోజులో చనిపోయిన వారిలో అత్యధిక మృతులు కావడం విషాదం నింపింది. 

ఇటలీలో 1.41 లక్షలు, స్పెయిన్ లో 1.35 లక్షలు, ఫ్రాన్స్ లో 1.09 లక్షలు, జర్మనీ 1.07 లక్షలు, ఇరాన్ లో 62వేలు, బ్రిటన్ లో 55వేలు, టర్కీలో 34 వేలు, మిగతా యూరప్ దేశాల్లో 20వేల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు.

*భారత్ లో 5వేలు దాటిన కరోనా కేసులు
భారత్ లోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వారం రోజుల్లోనే దాదాపు 3500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండోదశను దాటి సామూహిక వ్యాప్తిలోకి కరోనా ప్రవేశించినట్టు ఎయిమ్స్ సైతం ధృవీకరించింది.  బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5325 అని  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.  దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 165కు చేరింది.  మంగళవారం ఒక్కరోజు 560కు పైగా కేసులు నమోదయ్యాయి.  ఏప్రిల్ 2 నుంచి ఏకంగా 2600 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనే 1000 కేసులు దాఖలయ్యాయి.  గుజరాత్ లో 14 నెలల చిన్నారి చనిపోవడం కలిచివేసింది. కరోనాతో చనిపోయిన అతిపిన్న వయసున్న బాధితుడు ఈ బాలుడే.

* తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా
తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణలో కొత్తగా  40 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 440కు చేరింది. వీరిలో 35మంది కోలుకొని ఇంటికెళ్లారు... ఇక తెలంగాణలో వైరస్ కారణంగా 11 మంది చనిపోయారు.

*ఏపీలో 303 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా కేసుల సంఖ్య  329కు చేరింది.  మంగళవారం చేసిన పరీక్షల్లో కొత్తగా నెల్లూరు లో 6, కృష్ణలో 6 , చిత్తూరులో 3 కేసులు నమోదయ్యాయి.  కొత్తగా నమోదైన 15 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కు పెరిగింది.
Tags:    

Similar News