ఇండియాలో 87 శాతం మంది సోష‌ల్ మీడియానే న‌మ్ముతున్నారా?

Update: 2022-07-01 02:30 GMT
ఇది నిజంగా షాకింగ్ స‌ర్వేనే. ఇండియాలో ఏదైనా స‌మాచారాన్ని నిర్దారించుకోవ‌డానికి 87 శాతం మంది ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియా మీదే ఆధార‌ప‌డుతున్నార‌ని తేలింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిందే నిజ‌మ‌ని 87 శాతం మంది న‌మ్ముతున్నారంట‌. ప‌త్రిక‌లు, టీవీలు, ఇత‌ర మాధ్య‌మాల్లో సంబంధిత స‌మాచారం ఉన్న‌ప్ప‌టికీ వాటి కంటే సోష‌ల్ మీడియానే అధికంగా విశ్వసిస్తున్నార‌ని వెల్ల‌డైంది. ఈ మేర‌కు ఇంగ్లండ్ లోని ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీ ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ నిర్వ‌హించిన తాజా స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డ‌య్యాయి.

ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ఈ స‌ర్వేను భార‌త్, మెక్సికో, దక్షిణాఫ్రికా, అమెరికా, ఇంగ్లండ్ ల్లో నిర్వహించింది. మిగతా దేశాలతో పోలిస్తే సోష‌ల్ మీడియాలో తాము చదివిన, పంచుకున్న సమాచారం నిజమేనని 87% భారతీయులు నమ్ముతున్నార‌ని ఈ స‌ర్వే సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించింది.

భారత్‌లో కచ్చితమైన సమాచారం తెలుసుకొనేందుకు టీవీలు, ప‌త్రిక‌లు కంటే సోష‌ల్ మీడియానే ప్ర‌జ‌లు ఆశ్ర‌యిస్తున్నార‌ని స‌ర్వే పేర్కొంది. తమకు తెలిసిన విషయాన్ని రూఢీ చేసుకొనేందుకు 54% మంది భార‌తీయులు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లనే ఆశ్రయిస్తున్నారు. మ‌రో 33 శాతం ఇతర సోష‌ల్ మీడియా మాధ్య‌మాల‌పై ఆధార‌ప‌డుతున్నారు.

మెక్సికో, దక్షిణాఫ్రికాల్లో సోష‌ల్ మీడియాపై ఆధార‌ప‌డేవారి సంఖ్య 43 శాతంగా ఉంది. బ్రిటన్‌లో మాత్రం ఇది కేవలం 16 శాతం మాత్ర‌మే ఉండటం గమనార్హం.

ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ స‌ర్వే ప్రకారం.. సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా 67% మంది గూగుల్‌ సెర్చ్ ఇంజ‌న్‌పై ఆధారపడుతున్నారు. నిజానిజాల నిర్ధారణకు 52 శాతం మంది ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పుస్తకాలు, ఇతర సంప్రదాయ పద్దతుల ద్వారా వాస్తవాలను రూఢీ చేసుకోవడం తగ్గిపోతోంది. ముఖ్యంగా యువకులు సామాజిక మాధ్యమాల్లో వచ్చిందే నిజమని నమ్ముతున్నారు.

25 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉన్నవారు 44 శాతం మంది తాము ఎక్కువగా సోషల్‌ మీడియానే నమ్ముతామని తెలిపారు. అలాగే భారత్‌లో 30 శాతం మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఏదైనా విషయం వివరించేటప్పుడు వాట్సప్‌.. తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అంశాలనే ఉదాహరణలుగా చూపుతున్నార‌ని స‌ర్వే వెల్ల‌డించింది.
Tags:    

Similar News