ల‌వ్ ఎఫెక్ట్ : స్టూడెంటును ప్రేమించిన మ‌హిళా టీచ‌ర్.. ఎంత ప‌నిచేసిందంటే!

Update: 2022-11-09 02:30 GMT
ప్రేమ గుడ్డిద‌ని అంటారు. కానీ, ఇప్పుడు జ‌రిగిన ఓ సంఘట‌న‌లో మాత్రం ప్రేమ గుడ్డిదే కాదు.. అంత‌కుమించి! అని అన‌కుండా ఉండ‌లేం. పై ఫొటోలో చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న జంట‌.. క‌నువిందు చేస్తున్నారు క‌దా! వారు జంటే.. నూత‌న వ‌ధూవ‌రులే. కానీ, ఇక్క‌డే భారీ ట్విస్టు ఉంది. వ‌ధువు యువ‌తే. కానీ, వ‌రుడే యువ‌కుడు కాదు. ఆయ‌న కూడా యువ‌తే!  పైగా.. వీరి మ‌ధ్య సంబంధం, ప్రేమ‌.. ఇలాంటి విష‌యంలో ఏం జ‌రిగింద‌నేది తెలుసుకుంటే క‌ళ్లు తేలేయ‌డం ఖాయం. మ‌రి ఆ ఆస‌క్తిక‌ర ప్రేమ వివాహం ఏంటో తెలుసుకుందామా?

ఆమె ఓ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్.. తన పాఠాలు నేర్చుకునే విద్యార్థినుల్లో ఒకరితో ప్రేమలో పడింది. ఆ స్టూడెంట్‌నే పెళ్లి చేసుకోవాలని బలంగా నిర్ణయించుకుంది. అందుకోసం సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది. లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారిపోయింది. ఆమె కాస్త `అతడు`గా మారిపోవడంతో ఇంకెలాంటి అడ్డూ లేకుండా ఇటీవ‌లే వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో జరిగిన ఈ అరుదైన ఘటన అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచేసింది.

మీరా అనే యువతి రాజ‌స్థాన్‌లోని భరత్‌పుర్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తోంది. కల్పనా ఫౌజ్‌దార్  అనే విద్యార్థినితో ప్రేమలో పడింది. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ అనుకున్నారు. కానీ, ఇద్ద‌రూ మ‌హిళ‌లే. అయితే.. ఇక్క‌డ టీచ‌ర్‌ మీరా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. లింగమార్పిడి చేయించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఆపరేషన్ చేయించుకుని పురుషుడిగా మారిపోయింది. లింగమార్పిడి తర్వాత మీరా తన పేరుని ఆరవ్ కుంతల్‌గా మార్చుకున్నాడు.

 ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చని, అందుకే లింగమార్పిడి చేయించుకున్నానని అతడు చెప్పాడు. స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసుల్లో కలిసేవాళ్లమని, ప్లే గ్రౌండ్‌లో మాట్లాడుకునేవాళ్లమని అతడు చెప్పాడు. ఈ క్రమంలోనే ఇద్దరం ప్రేమలో పడ్డామని వివరించాడు.

తాను స్త్రీగా పుట్టినప్పటికీ.. మగాడిగా పుట్టుంటే బావుండేదని అనుకునేవాడినని ఆరవ్ గుర్తుచేసుకున్నాడు. లింగమార్పిడి చేయించుకోవాలని ఎప్పుడూ అనుకునేవాడినని, ఈ క్ర‌మంలోనే సర్జరీ చేయించుకున్నానని ఆరవ్ వెల్లడించాడు.

ఇక పెళ్లి కూతురు కల్పనా మాట్లాడుతూ.. ఆరవ్‌తో ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నట్టు చెప్పింది. ఆరవ్‌నే ప్రేమిస్తున్నానని, లింగమార్పిడి చేయించుకోకపోయినా అత‌డుగా మారిన ఆమెనే పెళ్లిచేసుకునేదానినని తెలిపింది. కాగా కల్పనా రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారిణి. ఇంటర్నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కోసం జనవరిలో దుబాయ్ వెళ్లాల్సి ఉంది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News