కరోనా కారణంగా పెళ్లి ఆలస్యం.. బెంగతో యువతి ఆత్మహత్య

Update: 2020-09-09 01:30 GMT
కరోనా ఒక యువతి ప్రాణం తీసింది. మహమ్మారి వ్యాప్తితో లాక్ డౌన్ రావడం.. నిబంధనలతో తన పెళ్లి ఆలస్యమవుతోందన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో విషాదం నింపింది.

బెజ్జంకి మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన వడిగె శిరీష (19) డిగ్రీ వరకు చదువుకొని ఇంటి దగ్గరే ఉంటోంది. కోహెడ మండలం మైనంపల్లికి చెందిన ఓ యువకుడు.. శిరీష మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరికి పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. వీరి వివాహాన్ని కొన్ని మాసాల క్రితమే జరిపించేందుకు నిర్ణయించారు.

అయితే సౌదీ అరేబియాలో గొర్రెల కాపరిగా పనిచేస్తున్న శిరీష తండ్రి నర్సింగం.. లాక్ డౌన్ కారణంగా విమానాలు నడవక భారత్ కు రాలేకపోయాడు.

దీంతో తనకు త్వరగా పెళ్లి చేయాలని శిరీష తల్లిపై కొంతకాలంగా ఒత్తిడి తీసుకువస్తోంది. తండ్రి వచ్చిన తర్వాతే పెళ్లి జరిపిస్తామని తల్లి ఆమెను సముదాయిస్తూ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే పెళ్లి ఆలస్యమవుతోందన్న బెంగతో పదిరోజుల క్రితం శిరీష పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాజాగా మంగళవారం కరీంనగర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News