అమీర్ మాటల మంట.. స్నాప్ డీల్ ఢమాల్

Update: 2015-11-25 07:56 GMT
ఎవరో జ్వాలను రగిలించారు.. వేరెవరో దానికి బలి అయినారు అని ఓ పాట ఉంటుంది. ఇప్పుడు స్నాప్ డీల్ వాళ్ల పరిస్థితి అలాగే ఉంది. అమీర్ ఖాన్ నోరు జారి అన్న నాలుగు మాటలు.. స్నాప్ డీల్ వ్యాపారానికి వందల కోట్లలో నష్టం కలిగించే పరిస్థితి కల్పిస్తున్నాయి. దేశంలో మత అసహనం పెరిగిపోతోందన్న మాటలతో ఏకీభవిస్తూ.. తన భార్య దేశం విడిచిపోవాలా అని అడిగే పరిస్థితి తలెత్తిందని మొన్న రాత్రి అమీర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. అమీర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అమీర్‌ మాటల్లో తప్పేముందని అనేవాళ్లు కూడా ఉన్నారు కానీ.. అతడి వ్యాఖ్యల్ని ఖండిస్తున్న వాళ్లే ఎక్కువమంది.

ఐతే కేవలం ఈ వ్యాఖ్యల్ని ఖండించి ఊరుకోకుండా అమీర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ‘స్నాప్ డీల్’ కంపెనీ మీదా పడ్డారు జనాలు. అమీర్ ప్రచారకర్తగా ఉన్న ఈ కామర్స్ సైట్ నుంచి వస్తువులేమీ కొనమంటూ సోషల్ మీడియాలో ఒక ఉద్యమం మొదలైంది. తమ మొబైల్స్ లో ‘స్నాప్ డీల్’ యాప్ తీసేస్తున్నామని కొందరంటే.. మరోవైపు చాలామంది సెల్లర్స్ కూడా ఆ సైట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. స్నాప్ డీల్ లోని వస్తువులకు తక్కువ రేటింగులు ఇవ్వడం.. ఇక్కడి వస్తువులు కొనవద్దని ప్రచారం చేయడం.. ఇలా చాలా హంగామానే నడుస్తోంది సోషల్ మీడియాలో. నిన్నట్నుంచి స్నాప్ డీల్ వ్యాపారం కూడా బాగా డల్ అయినట్లు చెబుతున్నారు. అర్జెంటుగా అమీర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తప్పించాలని కూడా స్నాప్ డీల్ వాళ్లను డిమాండ్ చేస్తుంటం గమనార్హం.
Tags:    

Similar News