మోడీ ఫ్లాష్ బ్యాక్ : పొలిటికల్ సీన్లోకి అబ్బాస్..?

Update: 2022-06-20 15:30 GMT
ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ళుగా దేశ పగ్గాలు పట్టుకుని ఇంత పెద్ద దేశాన్ని నడిపిస్తున్నారు. ఆయన జీవితం తెరచిన పుస్తకం అని బీజేపీ అంటుంది. కానీ ఆ పుస్తకంలో తెలియని ఎన్నో పేజీలు ఉన్నాయని అవి బీజేపీ వారికి కూడా తెలియవు అని ప్రత్యర్ధులు అంటారు. అలాంటి పేజీలలో కొన్ని తన తల్లి హీరాబెన్ మోడీ శత వసంతాల  వేడుక వేళ మోడీ బ్లాగ్ లో రాసుకున్నపుడు బయటపడ్డాయి.

తల్లితో గడపిన తన బాల్యం, అమ్మ పెంపకం గురించి చెబుతూ మోడీ అబ్బాస్ అనే ఒక ముస్లిం స్నేహితుని  గురించి కూడా ప్రస్థావించారు. నాడు తన ఊరిలో తన బాల్య  స్నేహితుడుగా అబ్బాస్ ఉండేవారని, అబ్బాస్ తండ్రి చిన్నతనంలో చనిపోతే తన తల్లితండ్రులే  అతన్ని తెచ్చి తమతో పాటే పెంచారని,  ఈద్ పండ‌గ వేళ అతనికి ఇష్టమైన వంటకాలు అన్నీ చేసి తన తల్లి తినిపించేదని, తమలో ఒకరుగా చూసుకున్నామని మోడీ చెప్పుకున్నారు.

ఇక అబ్బాస్ గురించి మోడీ ఇలా చెప్పారో లేదో కానీ ముస్లిం నాయకులు అంతా అబ్బాస్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. దేశంలో నుపూర్ శర్మ రగిలించిన చిచ్చు ముస్లింల  మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మరోమారు గుర్తు చేస్తూ ఈ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ నే అడగండి నుపూర్ శర్మ అన్న మాటలను ఆయన సమర్ధిస్తారో లేదో అని మజ్లీస్ నేత ఒవైసీ సూటిగానే మోడీని నిలదీశారు.

ఆయన చాలా తెలివిగానే మోడీని ప్రశ్నించారు. ఇంతకీ మీ స్నేహితుడు అబ్బాస్ ఉండి ఉంటే అంటూనే  ఆయన్నే ఇది ధర్మమా న్యాయమా అని అబ్బాస్ ని  అడగండీ మోడీజీ అని డిమాండ్ చేశారు. ఒకవేళ మీరు కనుక అడగలేకపోతే ఆ అబ్బాస్ చిరునామా ఇస్తే మేమే వెళ్లి ఆయన్ని కలసి బీజేపీ బహిష్కృత నేత నుపూర్ శర్మ కామెంట్స్ మంచివా కాదా అని ఆయన నోటి వెంటే చెప్పిస్తామని కూడా ఒవైసీ అంటున్నారు. అపుడైనా మోడీ అలా మాట్లాడిన వారి మీద చర్యలు తీసుకుంటారా అని కూడా అడుగుతున్నారు.

మొత్తానికి మోడీ తనకు కులమతాలు లేవు, ప్రాంతాలు లేవు, ప్రేమ ఒక్కటే అని ఇప్పటిదాకా  చెప్పుకుంటూ ఉంటారు. దానిని బలపరచేలా తన చిన్ననాటి స్నేహితుడి అబ్బాస్ ఉదంతాన్ని కూడా ఆయన తాజాగా బయటపెట్టారు. అయితే ఇది కాకతాళీయమా లేక దేశంలో నుపూర్ శర్మ కామెంట్స్ పట్ల ఒక వర్గం రగులుతున్న నేపధ్యంలో ప్రధాని అబ్బాస్ ప్రస్థావనను తేవడం ద్వారా తాను అన్ని వర్గాల మనిషిని తను ప్రత్యేకంగా వేరే వర్గం మీద  కోపాలు ఆవేశాలు లేవని చెప్పుకోవడానికి చేశారా  అన్న చర్చ కూడా సాగుతోంది.

ఏది ఏమైనా మోడీ తన బాల్యాని అమ్మ ప్రేమలోని తీపిని చెబుతూ దాన్ని తన స్నేహితుడు అబ్బాస్ కి కూడా పంచిందని చెప్పుకున్నారు. సర్వమత సమభావన అలా తన చిన్ననాడే తమ ఇంట్లో తన ఒంట్లో అలవడింది అని కూడా ఆయన చెప్పుకున్నారు. అయితే దీన్ని విపక్షాలు వదిలిపెట్టడం లేదు. అబ్బాస్ నే ముందు పెట్టి నుపూర్ శర్మ కామెంట్స్ మీద తీర్పు అడుగుతున్నారు. మరి మోడీని కార్నర్ చేస్తూనే అబ్బాస్ ని ముగ్గులోకి లాగుతున్నారు. ఇంతకీ ఎవరీ అబ్బాస్ ఆయన ఇపుడు ఎక్కడ ఉన్నారు.

ఇన్నాళ్ళూ మోడీ ఆయన గురించి ఎందుకు చెప్పలేదు ఇలా విపక్షాలు లక్ష సందేహాలు వ్యక్తం చెబుతున్నాయి. ఎనిమిదేళ్ళ తరువాత అయినా మీ స్నేహితుడు అబ్బాస్ గురించి చెప్పారు వెరీ గుడ్  అని ఒవైసీ అనడం వెనక కూడా రాజకీయ వెటకారమే ఉందని అంటున్నారు.
Tags:    

Similar News