ఫిఫా ప్రపంచకప్ మొదలైంది. గురువారం రష్యా రాజధాని మాస్కోలోని లుజ్నికి స్టేడియం తొలి మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తోంది. ఆరంభం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సౌదీ అరేబియా వర్సెస్ రష్యా మ్యాచ్ తో ఫుట్ బాల్ మేనియా మొదలు కాబోతోంది.
అయితే ఫుట్ బాల్ ప్రపంచకప్ నేపథ్యంలో మళ్లీ సెంటిమెంట్లు మొదలయ్యాయి. రష్యాకు చెందిన ఓ చెవిటి పిల్లి ‘అచిల్లె’ జ్యోతిష్యం చెప్పింది. ఆతిథ్య జట్టు రష్యానే గెలుస్తుందని ఈ చెవిటిపిల్లి జోస్యం చెప్పడంతో రష్యా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే గడిచిన ఎనిమిది నెలలుగా రష్యా ఒక్క విజయం సాధించలేదు. వరల్డ్ కప్ మ్యాచ్ ఫలితాలను అంచనా వేయడానికి అచిల్లెకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారట.. దీంతో ఈసారి తొలి మ్యాచ్ లో రష్యా గెలుస్తుందని ఈ పిల్లి చెప్పడం విశేషం.
రష్యా, సౌదీ రెండు దేశాల జాతీయ జెండాలను చెవిటి పిల్లి ముందు ఉంచగా అది రష్యా పతాకాన్ని ఎంచుకుంది. అచిల్లె అంచనా ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే మ్యాచ్ అయ్యేవరకు వేచిచూడాల్సిందే.. 2010లో కూడా ఇదేవిధంగా వరల్డ్ కప్ విషయంలో అక్టోపస్ పాల్ ఇదేవిధంగా మ్యాచ్ ఫలితాలను అంచానవేసింది. ఫైనల్ విజేతతో పాటు అది చెప్పిన మ్యాచ్ ఫలితాలన్నీ నిజమయ్యాయి. మరి ఇప్పుడు ఈ చెవిటి పిల్లి చెప్పింది ఎంత వరకు నిజమవుతుందో వేచిచూడాలి.