పొలిటికల్ ఎంట్రీతో షాకిస్తానంటున్న సినీ తార

Update: 2015-09-03 05:39 GMT
సినీ తారలు రాజకీయాల్లోకి అడుగుపెట్టటం కొత్త విషయమేమీ కాదు. తమకున్న గ్లామర్.. గ్రామర్ తో ఇప్పటికే ఎందరో సినీనటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటమే కాదు.. ఓ మోస్తరు పదవుల నుంచి అత్యున్నత స్థానాలకు చేరుకున్నారు కూడా. అందులోకి వ్యక్తిపూజ ఎక్కువగా ఉండే తమిళనాట రాజకీయాల్లోకి అడుగు పెట్టటానికి.. పదవులు సంపాదించటానికి సినిమాకి మించిన చక్కటి మాధ్యమం మరొకటి ఉండదేమో.

తెలుగు.. తమిళ చిత్రాల్లో తన అందచందాలతో ఆకట్టుకున్న సినీనటి నమిత తాజాగా ఆసక్తికర ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని.. తన పొలిటికల్ ఎంట్రీ గురించిన వివరాలు ప్రకటించారు. ఇప్పటికే తనను పలు పార్టీలు సంప్రదించాయని.. తాను ఏ పార్టీలో చేరే విషయాన్ని మాత్రం ఇప్పుడే వెల్లడించనంటూ ఊరిస్తోంది.

తాను పుట్టింది గుజరాత్ లో అయినా.. సినీనటిగా ప్రత్యేక గుర్తింపు ఇచ్చి.. పునర్జన్మను ప్రసాదించిన తమిళనాడు ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేయాలని భావించినట్లుగా చెప్పిన ఆమె.. అందుకు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. గతంలో బొద్దుగా ఉండే ఈ భామ.. స్లిమ్ గా మారి అందరిని షాక్ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు తన తాజా పొలిటికల్ ఎంట్రీతో మరోసారి షాకిస్తానని చెబుతున్నారు.

‘‘వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అందరికి షాకివ్వనున్నా. బరువు తగ్గటం అసాధ్యమని ఎంతో మంది చెప్పారు. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశా. ఇప్పుడు రాజకీయాల్లోనూ అనుకున్నది సాధించి చూపిస్తా’’ అంటూ ఆమె చెబుతున్నారు. ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదే. మరి.. మాటల్లోనేనా.. చేతల్లో కూడా అన్నది కాలమే డిసైడ్ చేయాలి.
Tags:    

Similar News