పార్టీ మారేటప్పుడు గుర్తుకు వస్తాయేమో

Update: 2015-12-25 04:53 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ లో చిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకూ అధినేత ఏం చెబితే దానికి ఎదురు మాట్లాడని నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలో తమ మనసులోని అసంతృప్తిని సైతం బయట పెట్టేందుకు ఇష్టపడని నేతలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా నోరు విప్పి తమకు అన్యాయం జరుగుతుందంటూ ప్రశ్నించటం కలకలం రేపుతోంది. పార్టీ అధినేత జగన్ ఏ నిర్ణయం తీసుకుంటే కిక్కురుమనకుండా ఉండే పరిస్థితికి భిన్నంగా పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. పార్టీపై జగన్ పట్టు తగ్గుతుందా? అన్న సందేహాలు కలిగే పరిస్థితి.

అయితే.. పార్టీ నుంచి బయటకు వెళ్లే వారు కావాలనే ఇలాంటివి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా.. పార్టీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి.. శ్రీకాంత్ రెడ్డిల వ్యవహరాన్ని చూపిస్తున్నారు. గతంలో అధినేత మాటకు ఎదురు చెప్పని ఆయన.. ఈ మధ్యన శ్రీకాంతరెడ్డికి జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ పార్టీ వేదికల మీద మండిపడుతున్నారట. ఓపక్క సీనియర్ తాను ఉంటే.. తనను పట్టించుకోకుండా శ్రీకాంత్ రెడ్డికి అంత ప్రాధాన్యం ఇవ్వటమేమిటని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుంటే పార్టీలో ఉండనని జగన్ ముందే చెప్పేసినట్లుగా చెబుతున్నారు.

ఈ గొడవంతా చూసిన శ్రీకాంత్ రెడ్డి తన కారణంగా గొడవలు వద్దని.. తనకు ఏ పదవి అక్కర్లేదంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పీయూసీ కమిటీలో తనకు సభ్యత్వం వద్దంటూ రాజీనామా లేఖను రాసినట్లుగా చెబుతున్నారు. తన వ్యాఖ్యలపై శ్రీకాంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. మరోవైపు ఆదినారాయణ రెడ్డి మాత్రం జగన్ బ్యాచ్ నుంచి బయటకు వచ్చేసి.. సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. పార్టీ విడిచి పెట్టి వెళ్లే ముందు ఇలాంటి ఆరోపణలు.. అసంతృప్తులు వ్యక్తం చేస్తే కానీ.. అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేరేమో..?
Tags:    

Similar News