జైట్లీ మంత్రిపదవికి అద్వానీ ఎసరు పెడుతున్నారా?

Update: 2015-12-25 07:29 GMT
బీజేపీలో డీడీసీఏ చిచ్చు రోజురోజుకీ రావణ కాష్టంగా మారుతుంది. ఆ పార్టీ ఎంపీ కీర్తీ ఆజాద్ ను పార్టీ నుండి ఏకపక్షంగా సస్పెండ్ చేయడం పై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషీ - అద్వానీ - యశ్వంత్ సిన్హా - శాంతా కుమార్ తదితరులు ఈ అంశంపై సమావేశమయ్యారు. తనకు బీజేపీ అన్యాయం చేసిందని కీర్తీ ఆజాద్ మార్గదర్శక మండలికి ఫిర్యాదు చేయడంతో అమిత్ షా తీరును సీనియర్లు ఖండించినట్లు సమాచారం. కీర్తీ ఆజాద్ గత నాలుగేళ్లుగా డీడీసీఏలో జరిగిన అక్రమాలపై పోరాటం చేస్తున్నారు. సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అదే మాట చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జైట్లీపై ఆరోపణలు రావడంతో ఆయన వివరణ కోరితే బాగుండేదని... అంతేకానీ, కీర్తి అజాద్ ను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం సరికాదని వినిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే పార్టీ కురువృద్ధుడు అద్వానీ... మోడీకి లేఖ రాయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సొంత పార్టీ నేతపై ఆరోపణలు వస్తే మొత్తం విచారణ జరిపించి ఆయన్ను క్లీన్ గా బయటకు తేగలగాలే తప్ప ఇలా ఆరోపణలు చేసినవారిని పంపించడం వల్ల మచ్చ పోదని అద్వానీ తన లేఖలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే అరుణ్ జైట్లీ కి కష్టం మొదలైనట్లే.  అయితే... ఎంత సీనియర్లయినా సరే వారి మాటలను, లేఖలను మోడీ ఎంతవరకు పట్టించుకుంటారన్నదీ చూడాలి. ఒకవేళ అద్వానీ లేఖకు విలువ ఇచ్చి జైట్లీపై విచారణకు ఆదేశిస్తే మాత్రం ఆయన తన కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి రాక తప్పదు.
Tags:    

Similar News