పిల్లల్ని అమ్ముకుంటున్న అఫ్గాన్ వాసులు .. రూ. 65 వేలు చాలట !

Update: 2021-11-11 02:30 GMT
తాలిబన్ల ఆక్రమణ అఫ్గానిస్థాన్‌ వాసుల జీవన విధానాన్నే మార్చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి పొందుతున్న ఎంతో మందిని కూడా ఆర్థికంగా దెబ్బకొట్టడంతో ఇల్లు గడవక పిల్లల ఆకలి ఎలా తీర్చాలో అర్థం గాక, ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని వేలకు వేలు పెట్టి కొన్న వస్తువుల్ని కుదిరిన మేరకు చాలా తక్కువ ధరలకు అమ్ముకుంటున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు.  లక్షలు పోసి కొన్న వస్తువుల్ని వేలకే విక్రయించిన పరిస్థితులు కాబుల్‌ వీధుల్లో కనిపించాయి. కుటుంబ సభ్యుల ఆకలి తీరిస్తే చాలన్నట్లు టీవీలు, ఫ్రిజ్‌లు, సోఫాలు, అల్మారాలు ఇలా ఇంట్లో ప్రతి విలువైన వస్తువు అక్కడి రోడ్లపై అమ్మకానికి పెట్టేస్తున్నారు.

ఇక తాజాగా అఫ్గాన్ వాసులు అమ్మడానికి ఏమీ లేక , తినడానికి తిండి లేక చివరి కన్న పిల్లలనే అమ్మేస్తున్నారు. డబ్బుల కోసం తన 13 నెలల మేనకోడలిని అమ్మేశారని ఇటీవలే ఓ మీడియా లో కథనం ప్రచారం అయ్యింది. ఘోర్ ప్రాంతానికి చెందిన ఒక తెగలోని వ్యక్తి చాలా దూరం నుంచి వచ్చి ఆ పిల్లని కొనుక్కుని వెళ్లారని, పాప పెద్దయ్యాక తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తానని తమ కుటుంబానికి మాటిచ్చారని చెప్పారు.

అక్కడే ఓ ఇంట్లో ఆరు నెలల పాప ఉయ్యాల్లో పడుకుని ఉంది. ఆ పాప నడవడం ప్రారంభించాక, ఆమెను కొనుగోలు చేసిన వ్యక్తి వచ్చి తీసుకెళతారు. ఆ ఇంట్లో మరో ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు.

ఆ కుటుంబానికి రోజూ ఆహారం దొరకడం గగనమే. చాలారోజులు ఆకలితోనే పడుకుంటారు. ఆ పాప తండ్రి చెత్త సేకరిస్తూ కుటుంబాన్ని షోషిస్తున్నారు.చాలా రోజులు సంపాదన ఏమీ లేకుండానే గడిచిపోతాయి. డబ్బులు వచ్చిన రోజు ఆరు లేదా ఏడు రొట్టెలు కొనుక్కుంటాం. వాటినే పంచుకుని తింటాం. మా పాపను అమ్మేయడానికి నా భార్య ఒప్పుకోవట్లేదు. అందుకే కాస్త ఆందోళనగా ఉంది. కానీ, నేనింకేం చేయలేను. బతకడానికి వేరే మార్గం లేదు. ఇంకెప్పుడూ నా భార్య కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడలేను" అని పాప తండ్రి చెప్పారు. బిడ్డను అమ్మితే వచ్చే డబ్బు వాళ్ల ప్రాణాలను నిలబెడుతుంది. మిగిలిన పిల్లలకు ఆహారం దొరుకుతుంది. కానీ, అది కొద్ది నెలలు మాత్రమే.

అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అధికంగా విదేశీ నిధులపై ఆధారపడి ఉంది.ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేపట్టిన తరువాత విదేశీ సహాయం పూర్తిగా నిలిచిపోయింది.దాంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, ప్రభుత్వోద్యోగులకు ఇచ్చే జీతలతో సహా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి.ఫలితంగా అట్టడుగు వర్గాలు దీనస్థితికి చేరుకున్నాయి. ఆగస్టుకు ముందు ఎలాగోలా బతుకీడ్చిన వాళ్ల పరిస్థితి ఇప్పుడు మరింత దుర్భరం అయిపోయింది.మానవ హక్కులకు ఎలాంటి రక్షణ ఉంటుందో, ఇచ్చిన డబ్బును ఎలా సద్వినియోగం చేస్తారో చెప్పకుండా తాలిబాన్లకు సహాయ నిధి అందించడం ప్రమాదకరం.కానీ, ఈ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపకపోతే మరింత మంది ప్రజలు ఆకలిచావులు చూడాల్సి వస్తుంది.బయట సహాయం లేకుండా ఈ శీతాకాలాన్ని ఎదుర్కోవడం లక్షలాది అఫ్గాన్ ప్రజలకు దుర్లభమని హెరాత్‌లో చూసిన పరిస్థితుల బట్టి స్పష్టమైంది.
Tags:    

Similar News