జీవితకాలం లేటు సామెతకు సరిపోయేలా డబ్ల్యూహెచ్ వో

Update: 2022-01-29 06:30 GMT
శుక్రవారం మధ్యాహ్నం నాటికి దేశంలో వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికి ‘నియో కోవ్’ అనే దరిద్రపుగొట్ట మహమ్మారి ఒకటి బయటకు వచ్చిందని.. దాని తీవ్రత దారుణంగా ఉంటుందంటూ వూహాన్ శాస్త్రవేత్తలు పేల్చిన బాంబు లాంటి ప్రకటన దిమ్మతిరిగిపోయేలా చేయటమే కాదు.. ప్రతి ఒక్కడూ వీలైనంత మందికి షేర్ చేయటం తెలిసిందే. గంటల వ్యవధిలో భారత్ లాంటి దేశంలో ఎక్కువ మంది దీని గురించి మాట్లాడుకునేలా చేసిన ఈ సరికొత్త మహమ్మారి మీద డబ్ల్యూహెచ్ వో స్పందించిన వైనం చూశాక.. ఒళ్లు మండిపోక మానదు.

నిజానికి కరోనా ఎపిసోడ్ ముందు వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనబడే డబ్ల్యూహెచ్ వో సంస్థ మీద బోలెడంత గౌరవ మర్యాదలు ఉండేవి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మీద ఈ తోపు సంస్థ వేసినన్ని పిల్లిమొగ్గుల దెబ్బకు.. ఇంతకాలం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిందంతా బిల్డప్పేనా? ప్రపంచ ప్రజలకు అవసరమైన వేళ.. ఇంతలా చేష్టలుడిగిపోవటమా? కరోనా మీద నిజాల్ని దాచిన చైనాను ఉతికి ఆరేయటమే కాదు.. ఈ దారుణ వైరస్ గురించి ప్రపంచాన్ని హెచ్చరించే విషయంలో ఘోరంగా విఫలమైన వైనం ఒక్కసారిగా గుర్తుకు రావటం ఖాయం.

మొదట్లో తప్పులు దొర్లాయనే అనుకున్నా.. గడిచిన రెండేళ్లకు పైనే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎపిసోడ్ మీద డబ్ల్యూహెచ్ వో బాధ్యతగా వ్యవహరించిందే కనిపించదు. అంతేకాదు.. ప్రపంచ ప్రజలకు తాను ఉన్నాన్న భరోసాను ఇచ్చింది లేదు. అలాంటి సంస్థ.. ప్రపంచం మొత్తం ఇప్పుడు మాట్లాడుకుంటున్న నియో కోవ్ మీద తీరుబడిగా స్పందించటమే కాదు.. దానిపై సదరు సంస్థ రియాక్టు అయిన వైనం చూస్తే ఒళ్లు మండక మానదు.

నియో కోవ్ ఉన్నట్టు వూహాన్ పరిశోధకులు గుర్తించిన వైనం గురించి తమకు తెలిసిందని.. అయితే.. ఈ వైరస్ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవటానికి మరింత అధ్యయనం అవసరమని వెల్లడించింది. మనుషుల్లో వచ్చే 75 శాతం అంటువ్యాధులకు మూలం జంతువులేనని.. మరీ ముఖ్యంగా అటవీ జంతువులుగా పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాల్ని పంచుకున్న చైనా పరిశోధకులకు థ్యాంక్స్ చెబుతున్నట్లుగా పేర్కొంది.

కొవిడ్ 19తో పోలిస్తే నియో కోవ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు. మరణాల రేటు అధికంగా ఉందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించటం తెలిసిందే. ఈ ఉదంతంపై మరింత అధ్యయనం అవసరమన్న చావు కబురు చెప్పే కన్నా.. మౌనంగా ఉంటే మంచిదేమో? కొవిడ్ ఎపిసోడ్ లో ఏలా అయితే చేష్టలుడిగినట్లుగా ఉండే కన్నా.. ఇప్పటికైనా యాక్టివ్ గా రియాక్టు కావాల్సిన అవసరం ఉంది కదా?

అయినా.. ప్రపంచ ఆరోగ్య సంస్థగా చెప్పుకునే ఈ సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా.. మరి ముఖ్యంగా చైనాలో ఏం జరుగుతుందన్న విషయాన్ని ఒక కన్నేసి ఉంచటంతో పాటు.. అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని యుద్ధ ప్రాతిపదికన పరిశోధించే వ్యవస్థ ఒకటి ఉండాలి కదా? అలాంటిదేమీ లేకుండా.. మరింత అధ్యయనం అవసరమన్న రోటీన్ మాటను విన్నంతనే.. ఈ మాత్రం దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉండాలా? అంత అవసరం ఉందా? అన్న ప్రశ్న మదిలో మెదలగ మానదు.
Tags:    

Similar News