కరోనా నుంచి కోలుకున్నాక.. ఈ 8 లక్షణాలు ఉంటే జర జాగ్రత్త

Update: 2021-05-11 07:30 GMT
కరోనా నుంచి ఎట్టకేలకు కోలుకున్నారా? ఇక్కడితో సినిమా పూర్తి కాలేదు. ఆ మాటకు వస్తే.. మరో సినిమా మొదలైనట్లే. కరోనా వేళ.. దాని బారి నుంచి తప్పించుకోవటానికి వైద్యులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు రోగిని బతికించటమే ముఖ్యమన్న రీతిలో వారు వైద్యం చేస్తున్నారు. ముందు కరోనా నుంచి బతికి బయటపడేద్దాం. తర్వాత వచ్చే విపరిణామాల్ని ఎదుర్కొందామన్న పరిస్థితి కూడా ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి.. పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ వాడిన వారు.. దాని బారి నుంచి బయటపడిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి.

మరి.. ముఖ్యంగా ఎనిమిది లక్షణాలు ఏమైనా కనిపిస్తే.. వెనువెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ పేరుతో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం.. కరోనా తగ్గిన రోగులకు ఒక సవాలుగా మారుతుంది. అలా అని.. దీని గురించి మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. బ్లాక్ ఫంగస్ ఎవరికైనా అటాక్ కావొచ్చు కానీ.. తీవ్రత ఎక్కువగా ఉండి.. ఆక్సిజన్ పెట్టిన పరిస్థితి.. టోసిలిజుమాబ్ లాంటి స్టెరాయిడ్లను ఉపయోగించిన వారికి.. షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు.. గుండె మార్పిడి.. అవయువ మార్పిడికి గురైన వారంతా చాలా జాగరూకతతో ఉండాలి.

ఇంతకీ.. ఆ 8 లక్షణాలు ఏమిటన్నది చూస్తే..
1.  ముఖం ఒక వైపు వాపు ఉండటం
2.  తలనొప్పి
3.  ముక్కుదిబ్బడ
4.  ముక్కు పైభాగంలో నల్లటి కురుపులు
5.  నోటి లోపలి భాగంలో నల్లటి కురుపులు
6.  జ్వరం
7. పాక్షిక దృష్టి లోపం
8.  కళ్ల కింద నొప్పి లాంటివి ముఖ్యమైనవి.
ఇంతకీ ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

సాంకేతికంగా చెప్పాలంటే.. మ్యుకోర్ మైకోసిస్ అనే అరుదైన శిలీంద్రం. తేమతో కూడిన ఉపరితలాలపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నల్లగా బూజు పట్టినట్లు ఉండటంతో దాన్ని బ్లాక్ ఫంగస్ గా అభివర్ణిస్తారు. కరోనా సోకిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడటం.. షుగర్ పేషెంట్లకు త్వరగా సోకే వీలుంది. ఈ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా.. ఎమ్మరై స్కాన్ చేయించుకోవటం చాలా అవసరం. దీన్ని సకాలంలో గుర్తించని పక్షంలో ప్రాణాలు పోయే వీలుంది. కొన్నిసార్లు అంధత్వం సంభవించే ప్రమాదం ఉంది. ముక్కు.. దవడ ఎముకల్ని తొలగించాల్సి రావొచ్చు. అందుకే.. కోవిడ్ తగ్గిన తర్వాత కూడా.. ఎవరికి వారు వారి ఆరోగ్య పరిస్థితిలో వచ్చిన మార్పుల్ని.. శరీరంలో వస్తున్న ఛేంజస్ ను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సిన అవసరం చాలా.. చాలా ఉంది. కనీసం ఆర్నెల్ల పాటు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News