ఇలాంటి అగ్రిగోల్డ్ ను ఏం చేయాలి..?

Update: 2016-05-13 10:05 GMT
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ అగ్రిగోల్డ్ సంస్థ తన కస్టమర్లకు ఎలాంటి కుచ్చుటోపీ పెట్టిందో తెలిసిందే. అగ్రిగోల్డ్ ను నమ్ముకొని నట్టేట మునిగిన వేలాది మంది బాధలు అన్నిఇన్నికావు. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును అగ్రిగోల్డ్ లో దాచుకుంటూ నాలుగు రూపాయిలు జమ అవుతాయని ఆశించిన వారికి.. ఆ కంపెనీ వ్యవహరించిన తీరుతో ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న సంగతి తెలిసిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ దుర్మార్గం మీద ఉమ్మడి హైకోర్టు కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టు ఎంత సీరియస్ అయ్యిందో తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సంస్థ మీద కర్ణాటకలోనూ కేసు నమోదై.. ఉడిపి కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే.. ఉడిపి కోర్టులోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా అక్కడి పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్)కు రూ.1.5కోట్ల లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారట.

ఈ సంచలన విషయాన్న ఉడిపి పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వయంగా బయటపెట్టారు. తనకు భారీ ఎత్తున లంచం ఇవ్వాలని ప్రయత్నించిన విషయాన్ని ప్రభుత్వానికి.. కోర్టుకు నివేదిక ఇవ్వటం సంచలనంగా మారింది. మరి.. ఈ లెక్కన అగ్రిగోల్డ్ వారు ఇలాంటి దుర్మార్గాలు ఇంకెన్ని చేశారు? తమ దగ్గరున్న మంది డబ్బుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అగ్రిగోల్డ్ యజమానుల్ని ఏం చేయాలి..?
Tags:    

Similar News