వైఎస్‌ ష‌ర్మిల దీక్షః పోలీసుల షాకింగ్ నిర్ణ‌యం!

Update: 2021-04-14 13:30 GMT
తెలంగాణ‌లో నిరుద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని, ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వాల‌నే డిమాండ్ తో వైఎస్ ష‌ర్మిల దీక్ష‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఖ‌మ్మంలో నిర్వ‌హించిన సంక‌ల్ప స‌భ‌లో ఆమె ఈ మేర‌కు ప్ర‌తిన‌బూనారు. విద్యార్థులు, నిరుద్యోగుల‌కు అండ‌గా ఉంటాన‌ని, వారి త‌ర‌పున పోరాటం చేస్తాన‌ని చెప్పారు. ఇందులో భాగంగా మూడు రోజుల నిర‌స‌న‌ దీక్ష‌కు సిద్ధ‌ప‌డ్డారు.

హైద‌రాబాద్ లోని ఇందిరా పార్కు వ‌ద్ద ఈ దీక్ష చేప‌ట్టేందుకు నిర్ణ‌యించారు. రేపు (15వ తేదీ) ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌ల‌య్యే దీక్ష‌.. 18వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు ముగించాల్సి ఉంది. ఈ మూడు రోజుల దీక్ష ముగిసిన త‌ర్వాత.. నాలుగ‌వ రోజు నుంచి జిల్లాల్లో నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కొన‌సాగిస్తార‌ని ప్ర‌క‌టించారు. ఇందుకోసం పార్టీ నేత‌లు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే.. ఈ దీక్ష కోసం హైద‌రాబాద్ పోలీసుల అనుమ‌తి కోరుతూ లేఖ రాశారు నాయ‌కులు. కానీ.. ఈ దీక్ష‌కు పూర్తిస్థాయిలో అనుమ‌తి ఇచ్చేందుకు పోలీసులు నిరాక‌రించిన‌ట్టు స‌మాచారం. వారు మూడు రోజుల అనుమ‌తి కోర‌గా.. ఒక్క రోజు మాత్ర‌మే దీక్ష‌కు అనుమ‌తించిన‌ట్టు తెలుస్తోంది. మూడు రోజుల్లో ఏదైనా ఒక‌రోజు మాత్ర‌మే దీక్ష చేప‌ట్టాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. మ‌రి, దీనిపై ష‌ర్మిల ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
Tags:    

Similar News