విమాన ఛార్జీలు పెరగబోతున్నాయి పారాహుషార్.. ఎంతంటే?

Update: 2022-06-18 00:30 GMT
ఒకటి తర్వాత ఒకటి చొప్పున పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. తాజాగా మరో భారానికి రెఢీ కావాల్సిన టైం వచ్చేసింది. విమానయాన ధరలు పెరగబోతున్నాయి. రూపాయి మారకం విలువ పడిపోవటం.. విమాన ఇంధనం ధర భారీగా పెరిగిపోవటంలాంటి కారణాలతో టికెట్ల ధరల్ని పెంచక తప్పని పరిస్థితి చోటు చేసుకుంది.

నిర్వాహణ వ్యయాల్ని తట్టుకునేందుకు టికెట్ ధరల్ని పెంచక మరో దారి లేని పరిస్థితి. పెట్రోల్.. డీజిల్ మాదిరే విమాన ఇంధనం మీద కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల భారం భారీగా ఉండటం కూడా తాజా పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. విమాన ఇంధనం ధరలు ఏడాది వ్యవధిలో ఏకంగా 120 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు.

అంతకంతకూ పెరుగుతున్న ఇంధన భారాన్ని మోసే పరిస్థితుల్లో విమానయాన సంస్థలు లేవని.. అందుకే విమాన ఛార్జీలను పెంచాల్సిన పరిస్థితి వచ్చేసిందంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో విమాన ఇంధన పన్నులు మన దేశంలోనే ఉన్నాయని చెబుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే తాజా పరిస్థితికి మోడీ సర్కారు కూడా కారణంగా చెప్పక తప్పదు.

ఇంధన భారాన్ని ఇంతకాలం పంటిబిగువునా భరిస్తూ వచ్చిన విమానయాన కంపెనీలు ఇప్పుడు ఆ భారాన్ని ప్రయాణికులకు బదిలీ చేయక తప్పని పరిస్థితికి వచ్చిందంటున్నారు. ఎయిర్ లైన్స్ నిర్వహణ వ్యయాల్లో 50 శాతం వాటా ఏటీఎఫ్ దేనన్నారు. ఇప్పటివరకు 40 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టే ప్రయాణాలకు సంబంధించిన విమాన టికెట్ ధర కనిష్ఠంగా రూ.2900.. గరిష్ఠంగా 8800లకు మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం.

అయితే.. అంతర్జాతీయంగా మండుతున్న ముడి చమురు.. దానికి తగ్గట్లే మోడీ సర్కారు వారి భారీ పన్నులు దేశీయ విమాన ఇంధన ధరల్ని మండిపోయేలా చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో విమాన ఇంధన ధర కిలో లీటరుకు తాజాగా రూ.19757 పెరిగింది.

దీంతో కిలో లీటరు ధర రూ.1.41 లక్షలకు చేరింది. ఈ ఏడాది వరుసగా పదిసార్లు పెరిగిన ధరల కారణంగా 15 శాతం వరకువిమాన టికెట్ల ధరలు పెరగక తప్పనిపరిస్థితి ఏర్పడిందంటున్నారు. సో.. మరో భారానికి సిద్దం కావాల్సిన టైం వచ్చేసినట్లే.
Tags:    

Similar News