అక్బ‌రుద్దీన్ కు క్లీన్ చిట్‌..కంప్లైంట్ చేసినా కేసు క‌ట్ట‌రంతే!

Update: 2019-07-28 07:17 GMT
గ‌డిచిన మూడు రోజులుగా హాట్ టాపిక్ గా మారారు మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ సోద‌రుడు అక్బ‌రుద్దీన్ ఓవైసీ. క‌రీంన‌గ‌ర్ లో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న ఉద్రిక్త పూర్వ‌కంగా.. ఊగిపోతూ ఆయ‌న చేసిన ప్ర‌సంగంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. కొన్నేళ్ల క్రితం పావుగంట టైమిస్తే.. దేశంలో హిందూ-ముస్లిం లెక్క‌ను స‌రి చేస్తానంటూ చేసిన దారుణ వ్యాఖ్య‌ల్ని రిపీట్ చేశారంటూ వార్త‌లు వ‌చ్చాయి.

అక్బ‌రుద్దీన్ ప్ర‌సంగం ఉర్దూలో ఉండ‌టంతో ఆయ‌నేం మాట్లాడారో అర్థం కాని ప‌రిస్థితి. మీడియా రిపోర్టులు మొత్తం ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్న‌ట్లుగా వ‌చ్చాయి. అప్ప‌ట్లో తాను చేసిన పావుగంట వ్యాఖ్య‌ల త‌ర్వాత ముస్లింల‌లో మ‌నో ధైర్యం పెరిగిన‌ట్లుగా పేర్కొన్నారు.

అక్బ‌రుద్దీన్ చేసిన‌ట్లుగా చెబుతున్న వ్యాఖ్య‌ల వార్త‌లు పెద్ద ఎత్తున వైర‌ల్ గా మార‌టంతో పాటు సంచ‌ల‌నంగా మారాయి. దీంతో అక్బ‌రుద్దీన్ మ‌త విద్వేషాల్ని రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ పలు పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇది అంత‌కంత‌కూ పెరుగుండ‌టంతో పోలీసుల‌పై ఒత్తిడి పెరిగింది.

ఈ నేప‌థ్యంలో ఈ ఉదంతం చోటు చేసుకున్న కరీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ నెల 23న క‌రీంన‌గ‌ర్ లో నిర్వ‌హించిన స‌మావేశంలో ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ పాల్గొన్నార‌ని..ఆయ‌న ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగించిన‌ట్లుగా వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. ఆయ‌న ప్ర‌సంగానికి సంబంధించి ముంద‌స్తుగా రికార్డు చేయించామ‌ని.. దాన్ని అనువాదం చేయించి.. న్యాయ నిపుణుల స‌ల‌హా కోసం పంపిన‌ట్లుగా పేర్కొన్నారు.

ఈ వీడియోను ప‌రిశీలించిన న్యాయ‌నిపుణులు ఆ ప్ర‌సంగంలో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు లేవ‌ని తేల్చిన‌ట్లుగా క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీబీ క‌మ‌లాస‌న్ రెడ్డి తాజాగా తేల్చేశారు.

దీంతో అక్బ‌రుద్దీన్ క‌రీంన‌గ‌ర్ ప్ర‌సంగంపై క్లీన్ చిట్ ఇచ్చేసిన‌ట్లుగా చెప్పాలి.  క‌రీంన‌గ‌ర్ పోలీస్ బాస్ ప్ర‌కట‌న నేప‌థ్యంలో అక్బ‌రుద్దీన్ పై ఎలాంటి కంప్లైంట్ లు స్వీక‌రించ‌కూడ‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో.. అక్బ‌రుద్దీన్ పై క‌రీంన‌గ‌ర్ ఎపిసోడ్ కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదుల్ని పోలీసులు తీసుకోవ‌టానికి ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌టం లేదు. బాస్ క్లీన్ చిట్ ఇచ్చిన త‌ర్వాత‌.. తిరుగేముంటుంది చెప్పండి.
Tags:    

Similar News