తండ్రి కొడుకుల పేచీకి ఫుల్ స్టాప్ ఇదే!

Update: 2017-01-05 11:31 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఎన్నిక‌ల ముందు స‌మాజ్‌ వాదీ పార్టీని దాదాపు చీలిక‌కు ద‌గ్గ‌ర‌గా తీసుకెళ్లిన ములాయం - అఖిలేష్ యాద‌వ్‌లు ప్ర‌స్తుతం పార్టీ గుర్తు సైకిల్ కోసం పోరాడుతున్న విష‌యం తెలిసిందే. ఏడు విడ‌త‌ల యూపీ ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 11 నుంచి మొద‌ల‌వుతుండ‌టంతో గుర్తు కోసం పోరు ఉద్ధృత‌మైంది. ఈ నేప‌థ్యంలోనే రెండు వ‌ర్గాల వారు ఇప్ప‌టికే ఈసీని క‌లిసి త‌మ‌కే ఆధిక్యం ఉంద‌ని, అందువ‌ల్ల సైకిల్ త‌మ‌దేన‌ని వాదించాయి. సైకిల్ కావాలంటే మీ మెజారిటీ నిరూపించుకోండి.. వచ్చే సోమవారం వ‌ర‌కు డెడ్‌ లైన్ అంటూ సైకిల్ గుర్తు కోసం పోటీ ప‌డుతున్న తండ్రీ కొడుకుల‌కు ఎన్నిక‌ల సంఘం తేల్చిచెప్పింది.

ఈసీ త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆ ప‌నిలో ప‌డ్డాయి ములాయం - అఖిలేష్ వ‌ర్గాలు. త‌న‌కు మద్ద‌తుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు - పార్టీ ప‌ద‌వుల్లో ఉన్న‌వారిని గురువారం స‌మావేశానికి ఆహ్వానించారు అఖిలేష్‌. ఆ స‌మావేశంలోని వారి సంత‌కాలు తీసుకొని వాటిని ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించ‌నున్నారు. ఎవ‌రికి మెజార్టీ ఉంటుందో వారిదే అస‌లైన స‌మాజ్‌ వాదీ పార్టీ అవుతుంది. గ‌త కొన్ని రోజులుగా తండ్రీ కొడుకులు రాజీ కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. పార్టీని ఎవ‌రు న‌డ‌పాలి - రాబోయే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను ఎవ‌రు ప్ర‌క‌టించాల‌న్న విష‌యాల్లో ఇద్ద‌రి మ‌ధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అభ్య‌ర్థుల‌ను తానే ప్ర‌క‌టిస్తాన‌ని - శివ‌పాల్‌ ను జాతీయ రాజ‌కీయాల్లోకి పంపాల‌ని అఖిలేష్ డిమాండ్ చేస్తున్నారు. కానీ ములాయం మాత్రం స‌సేమిరా అంటున్నారు. దీంతో ఎస్పీలో ఫ్యామిలీ డ్రామా కొన‌సాగుతూనే ఉంది. అయితే చ‌ర్చ‌లు సాగుతుంటాయ‌ని అఖిలేష్ స్ప‌ష్టంచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News