బంగ్లా ఇష్యూలో ఆ మాజీ సీఎం మ‌ళ్లీ బుక్!

Update: 2018-08-03 07:11 GMT
కొంద‌రు రాజ‌కీయ ప్ర‌ముఖుల్ని కొన్ని అంశాలు అదే ప‌నిగా వెంటాడి వేధిస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒక‌టి యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ ను వెంటాడుతోంది. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వేళ ఆయ‌న‌కు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేసేందుకు జ‌రిగిన హ‌డావుడి తెలిసిందే. ప‌ద‌వి పోయిందా?  ప్ర‌భుత్వం త‌ర‌ఫున వ‌చ్చే విలాసాల్ని.. వ‌స‌తుల్ని వ‌దిలేస్తే అక్క‌డితో పోతుంది.

కానీ.. వాటిని వ‌దిలేందుకు ఏమాత్రం సంశ‌యించినా.. అందుకు త‌గ్గ మూల్యం చెల్లించాల్సిందే. తాజాగా అలాంటి ప‌రిస్థితే ఎదుర్కొంటున్నారు అఖిలేశ్ యాద‌వ్‌. కోర్టు జోక్యం అనంత‌రం తన‌కు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేసి ప‌రువు పోగొట్టుకున్న ఆయ‌న‌.. తాజాగా మ‌రోసారి అలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు.

అఖిలేశ్ ఖాళీ చేసిన బంగ్లాలో ఫ‌ర్నీచ‌ర్ ను చాలావ‌ర‌కూ న‌ష్టం క‌లిగించార‌న్న ఆరోప‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. బంగ్లాను ఖాళీ చేసే క్ర‌మంలో దానికి చాలా న‌ష్టం చేశార‌ని.. దీనికి సంబంధించి రాష్ట్ర ప్ర‌జా ప‌నుల శాఖ చీఫ్ ఇంజినీర్ ఏకే శ‌ర్మ ద‌ర్యాప్తు చేశారు. ఆయ‌న నివేదిక ప్ర‌కారం అఖిలేశ్ కార‌ణంగా బంగ్లాకు జ‌రిగిన న‌ష్టం రూ.10ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని తేల్చారు.

టైల్స్.. శానిట‌రీ ప్యాన‌ల్స్‌.. ఎల‌క్ట్రిక‌ల్ వైరింగ్ కు భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అఖిలేశ్ రూ.10ల‌క్ష‌లు ప్ర‌భుత్వానికి చెల్లించాల్సి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అయినా.. ప్ర‌భుత్వ బంగ్లాను ఖాళీ చేసేట‌ప్పుడు సుబ్బ‌రంగా ఉందా?  లేదా? అని చూసి.. ఏదైనా తేడాగా ఉంటే.. ఆ మొత్తానికి అయ్యే రిపేరు ఖ‌ర్చు నేను పెట్టుకుంటాన‌ని పెద్ద మ‌నిషిలా మాట్లాడి ఉంటే ఎంత బాగుండేది?  అలాంటిదేమీ లేకుండా ఇలా వార్త‌ల్లో నాన‌టం ఏమైనా బాగుంటుందా అఖిలేశ్‌?
Tags:    

Similar News