వరాల మూటే అఖిలేశ్ అయుధం

Update: 2017-01-23 04:22 GMT
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం మరింత రంజుగా మారింది. పొత్తులు ఒక కొలిక్కి రావటం.. అభ్యర్థుల జాబితాలు ఒకటి తర్వాత ఒకటిగా విడుదల కావటం.. ఎన్నికల మేనిఫేస్టోలనుపార్టీలు విడుదల చేయటం లాంటివి ఒకటి తర్వాత ఒకటిగా సాగుతున్నాయి. తాజాగా.. యూపీ అధికారపక్షమైన సమాజ్ వాదీ (ఎస్పీ) పార్టీ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. అంతర్గత విభేదాలతో అట్టుడికిపోయిన ఎస్పీలో అంతా సర్దుకుందన్నట్లుగా వస్తున్న వాదనల్లో పస లేదన్న విషయం ఎన్నికలమేనిఫేస్టో విడుదల సందర్భంగా మరోసారి కనిపించింది.

మేనిఫేస్టో విడుదల సందర్భంగా అఖిలేశ్ తండ్రి ములాయం .. ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ డుమ్మా కొట్టేశారు. అయితే.. ఈ లోటును కవర్ చేసేందుకు రంగంలోకి దిగిన మంత్రి అజాంఖాన్ ములాయంను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్  కారణంగా తాను సమయానికి చేరుకోలేకపోయినట్లుగా ములాయం వెల్లడించారు. పార్టీ వ్యవస్థాపక అథ్యక్షుడు రావటం ఆలస్యమైతే.. ఎన్నికల ప్రణాళికను ప్రకటించే విషయంలో కాస్త ఆగితే ఏమయ్యోదో? అన్న విమర్శలు వినిపించినా.. వాటికి అఖిలేశ్ అండ్ కో వివరణ ఇవ్వలేదు.

ఇక.. అధికారమే ధ్యేయంగా బరిలోకి దిగిన అఖిలేశ్.. ఎట్టిపరిస్థితుల్లో తన చేతిలోని పవర్ చేజారి పోకూడదన్న తపన ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికను చూస్తే అర్థం కాక మానదు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారి మనసుల్ని దోచుకునేలా హామీలు ఇచ్చిన తీరు ఎస్పీ విడుదల చేసిన మేనిఫేస్టోను చూస్తే అర్థమవుతంది. ఓటర్ల మనసుల్ని దోచుకునేందుకు వీలుగా వరాల మూటను అఖిలేశ్ సంధించిన వైనం కనిపించక మానదు.

విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ హామీ ఇచ్చిన అఖిలేశ్.. ఏడాదికి రూ.1.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తామన్న వెల్లడించారు. ఇక.. రూ.2లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని 18 ఏళ్లకు పైబడిన వారందరికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నెలకు వెయ్యి రూపాయిల చొప్పు కోటి మందికి పింఛన్లు.. మహిళలకు రాష్ట్ర రవాణా బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పించనున్నట్లుగా ప్రకటించారు. గ్రామాలకు నాన్ స్టాప్ విద్యుత్ ఇస్తామన్న హామీతో పాటు.. తొమ్మిది తరగతి నుంచి ప్లస్ టూ చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 60 ఏళ్ల లోపు న్యాయవాదులు ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే.. వారి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పేద విద్యార్థులకు ప్రతి నెలా కిలో పాలపొడి.. కిలో నెయ్యి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అగ్రా.. కాన్పూర్.. వారణాసి.. మీరట్ లలో మెట్రో రైలును విస్తరిస్తామంటూ భారీ ప్రణాళికనే.. తమ ఎన్నికల హామీలుగా అఖిలేశ్ ఇచ్చారు. మరి.. వీరి హామీలకు ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News