సినిమా వాళ్ల సీరియల్: 'అబ్బే.. డ్రగ్స్ కేసు అయిపోలేదు'

Update: 2019-05-14 16:15 GMT
కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయారు  అనే విమర్శ వస్తోంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారుల మీద. డ్రగ్స్ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన చార్జిషీట్ అంశం చర్చనీయాంశంగా మారింది. చార్జిసీట్లో ఎలాంటి వివరాలనూ పొందు పరచలేదని, కేవలం ఎవరెవరిని విచారించనట్టో వివరిస్తూ ఒక సింగిల్ పేజీ చార్జిషీట్ ను మాత్రమే దాఖలు చేసి.. ఈ కేసులో పోలీసులు తమ డొల్ల తనాన్ని తామే బయటపెట్టుకున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి.

సినిమా వాళ్లు ఇన్ వాల్వ్ అయిన ఈ కేసు ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. జనాలందరికీ బాగా పరిచయస్తులు అయిన సినిమా వాళ్లు డ్రగ్స్ వాడుతున్నారనే  అంశం చర్చకు వచ్చి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అలాగే వారిలో కొందరు డ్రగ్స్ డీలర్ షిప్ చేశారనే ఆరోపణ కూడా ఉంది.

ఈ కేసులో కలిగించిన అనుమాలన్నీ పోలీసులు ద్వారా బయటకు వచ్చినవే. అయితే ఇప్పుడు వారే ఈ కేసులో సదరు సినీ తారలను కేవలం సాక్షులు మాత్రమే అన్నట్టుగా చార్జిషీట్ దాఖలు చేశారు! ఈ నేపథ్యంలో విమర్శల జడి మొదలైంది.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో డ్యామేజ్ కవరేజ్ కు దిగారు పోలీసులు. ఇది కేవలం మొదటి చార్జిషీట్ మాత్రమే అని, అది కూడా ఏడాది కిందటిదన్నట్టుగా అకున్ సబర్వాల్ ప్రకటించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసు వెలుగులోకి వచ్చిన్నప్పుడు దీన్నంతా డీల్ చేసింది ఆయనే. ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నారంటే.. ఈ కేసులో తదుపురి చార్జిషీట్లు సాగుతాయని.. వివిధ చార్జిషీట్లు దాఖలవుతాయనేది అకున్ స్టేట్ మెంట్ గా తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఈ కేసు విచారణ అకున్ పరిధిలోనే లేనట్టుగా తెలుస్తోంది! ఇలాంటి నేపథ్యంలో ఆయన స్టేట్ మెంట్ కు ఉన్న విలువ ఏమిటో అర్థం చేసుకోదగినదే! 

   

Tags:    

Similar News