అన్ని పార్టీల అగ్ర నేత‌లు అక్క‌డే..!

Update: 2019-10-05 13:14 GMT
తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలడంతో ఇక అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల ముఖ్య నేతలంతా ఒకే రోజు హుజూర్‌నగర్‌ కేంద్రానికి వచ్చి పార్టీ కేడర్‌కు గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఉదయం నుంచి  రాత్రి వరకు పార్టీల నేతల రాక, సమావేశాలు, ప్రచారాలతో హుజూర్‌నగర్‌ అంతా రాజకీయ కోలాహలానికి వేదికైంది.  బరిలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున అధినేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

శుక్రవారం ఒక్కరోజే ఆ పార్టీ ముఖ్య నేతల రాకతో హుజూర్‌నగర్‌లో రాజకీయ జోష్‌ కనిపించింది. టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గ కేంద్రంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ హుజూర్‌నగర్‌కు వచ్చారు. పట్టణంలో కేటీఆర్‌ రోడ్డు షో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల ఎమ్మెల్సీలు కేటీఆర్‌ వెంట రోడ్డుషోలో పాల్గొన్నారు.

కేటీఆర్ స్వ‌యంగా రావ‌డంతో టీఆర్ఎస్ శ్రేణులు ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు ఇత‌ర జిల్లాల నుంచి భారీ ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ చేసి స‌త్తా చాటారు. దీంతో హుజూర్‌న‌గ‌ర్ అంతా గులాబీ మ‌యం అయ్యింది.

అలాగే తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఆ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ఇక సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కేడర్‌తో సమావేశం నిర్వహించారు. సీపీఐ ఇప్ప‌టికే టీఆర్ఎస్‌కు స‌పోర్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేయాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ కేడర్‌తో నిర్వ‌హించిన సమావేశానికి బీజేపీ జాతీయ నాయకులు హాజరయ్యారు. ఉప ఎన్నికల ప్రచారానికి ఈ రోజుతో కలిపి సరిగ్గా పదిహేను రోజుల సమయం ఉండ‌టంతో అన్ని పార్టీ అగ్ర నేత‌లు హుజూర్‌న‌గ‌ర్‌లోనే మ‌కాం వేశారు.



Tags:    

Similar News