ఉత్తరాంధ్ర బార్లు మొత్తం ఆ మంత్రి కనుసన్నల్లోనేనట!

Update: 2022-08-02 09:22 GMT
పప్పు బెల్లాల మాదిరి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న వేళ.. వాటికి అవసరమైన నిధులకు అప్పులు చేయటం మినహా మరో మార్గం లేని పరిస్థితి. ఆ అప్పులు కాస్తా అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. ఆదాయాన్ని పెంచుకోవటానికి కొత్తగా బార్ల లైసెన్సులు మినహా మరో మార్గం లేకుండా పోయింది ఏపీ సర్కారుకు. మాట తప్పని.. మడమ తిప్పని ఫ్యామిలీగా గొప్పలు చెప్పుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి.. మద్యనిషేధం మీద తాను గతంలో చెప్పిన మాటల్ని అమలు చేసే అవకాశం లేకుండా పోయింది.

దీంతో.. ఆయన గతాన్ని మర్చిపోవాలని బలంగా అనుకుంటున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు హయాంలో ఉన్న బార్లకు రెండు తక్కువగా అన్నే బార్లకు లైసెన్సులకు వేలం నిర్వహిస్తున్నారు.

అనూహ్యంగా రాయలసీమలో బార్ల లైసెన్సుల కోసం పడిన పోటీ అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే కడప జిల్లాలో అత్యధిక మొత్తాలకు బార్ల లైసెన్సుల్ని సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా బార్ల లైసెన్సుల మొత్తం కడప జిల్లాలోనే పలకటం విశేషం. కోటిన్నర రూపాయిలకు పైనే ఖర్చు చేసి బార్ లైసెన్సుల్ని సొంతం చేసుకున్న వైనం చూసినోళ్లు ముక్కున వేలేసుకున్న పరిస్థితి. అంత భారీగా లైసెన్సు ఫీజే చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని తిరిగి తెచ్చుకోవటంతో పాటు.. అంత భారీ పెట్టుబడికి ఆదాయం రావాలంటే ఎంతేసి మద్యాన్ని అమ్మాల్సి ఉంటుందన్న లెక్కలు వేసుకోవటంలో మునిగిపోతున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. రాయలసీమలో బార్ల లైసెన్సుల కోసం పోటాపోటీ పడగా.. అందుకు భిన్నంగా ఉత్తరాంధ్రలో మాత్రం అలాంటి పరిస్థితే లేకుండా పోయిందంటున్నారు. దీనికి కారణం.. ఒక సీనియర్ మంత్రేనని చెబుతున్నారు. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. బార్ల లైసెన్సుల విషయంలో తనకు ఎవరూ అడ్డుపడకూడదన్న ఫర్మానా జారీ చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. అనవసరంగా సర్కారుకు సొమ్ములు చెల్లించే కన్నా.. గుట్టుగా రింగు అయి.. ఒక రేటుకు ఫిక్సు అయి.. అంతకు మించి చెల్లించకూడదన్న ప్లాన్ చేసి.. దాన్నే విజయవంతంగా వర్కుట్ చేయటం కనిపిస్తోంది.

ఉత్తరాంధ్ర మినహా ఏపీలోని చాలా ప్రాంతాల్లోని చిన్న పట్టణాల్లో కూడా బార్ లైసెన్సు రూ.కోటికి పైనే పలుకుతుంటే.. ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటి విశాఖపట్నంలో బార్ కు పలికిన గరిష్ఠ ధర కేవలం రూ.60లక్షలు కావటమే చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది. విశాఖలో 128 బార్లకు అప్లికేషన్లకు అధికారులు అనుమతులు ఇస్తే 120 బార్లకు మాత్రమే ముందుకు రావటం చూస్తే.. రింగ్ ఎంత పక్కాగా జరిగిందన్నది ఇట్టే అర్థమవుతోంది ధర విషయంలోనే కాదు..దగ్గర దగ్గర ప్రాంతాల్లో ఉన్న బార్లలో ఒక దానికి మాత్రమే బిడ్డింగ్ వేసి.. వేరే వాటికి బిడ్డింగ్ పడకుండా నియంత్రించటంలోనూ ఒక మంత్రి కీలక భూమిక పోషించారని చెబుతున్నారు.

అంతేకాదు.. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి జిల్లాలకు కలిపి నోటిఫికేషన్ జారీ చేసిన బార్లు మొత్తం అధికార పార్టీకి చెందిన కీలక నేత పావులు కదిపి.. మొత్తంసీన్ ను సెట్ చేశారని చెబుతున్నారు. దీని కారణంగా ఆయన కోరుకున్న వారికి బార్లు రావటమే కాదు.. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి సైతం దెబ్బ పడిందంటున్నారు. మంత్రా.. మజాకానా?
Tags:    

Similar News