రాజధానిపై జగన్ నిర్ణయం..ఆ ఇద్దరికి కష్టకాలం తెచ్చిందా?

Update: 2019-12-24 06:29 GMT
నిజమే... ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు ప్రస్తుతం అజ్ఝాతవాసం పట్టక తప్పలేదన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను సైతం చిత్తుగా ఓడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ ఎమ్మెల్యే - పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఎదుగుతున్న ఉండవల్లి శ్రీదేవిలు ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించడం లేదు. నిత్యం ప్రజల్లో ఉండే నేతగా తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆళ్లతో పాటు ఎన్నికలు ముగిసిన నాటి నుంని అనునిత్యం ప్రజాక్షేత్రంలోనే సాగుతూ కనిపించిన శ్రీదేవి ఇప్పుడు నిజంగానే ఎక్కడ కూడా కనిపించడం లేదు. వీరిద్దరి అజ్ఝాతవాసానికి పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఎన్నికల వరకు అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తామని ప్రకటిస్తూ వచ్చిన జగన్... మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఓ సంచలన ప్రకటన చేశారు. ఆ వెంటనే రాజధాని కోసం ఏకంగా 33 వేల ఎకరాలకు పైగా సాగు భూములను ఇచ్చేసిన రాజధాని రైతులు భగ్గుమన్నారు. వెరసి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో వారం రోజులుగా నిరసనలు మిన్నంటుతున్నాయి. తమ ప్రభుత్వం వచ్చినా.. అమరావతిలోనే రాజధాని ఉంటుందని జగన్ చెప్పిన మాటను ఆళ్ల కూడా పదే పదే చెప్పారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ నిలిచినా కూడా జనం మనిషిగా పేరు తెచ్చుకున్న ఆళ్లను మంగళగిరి ప్రజలు గెలిపించారు. అంతేకాకుండా రాజధాని ప్రాంత అభివృద్ధి కమిటీకి ఆళ్లను చైర్మన్ గా నియమిస్తారన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ కారణంగానే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న వార్తలు కూడా వినిపించాయి. ఆ పదవి సంగతేమో గానీ... ఇప్పుడు ఆళ్ల బయట ఎక్కడా కనిపించకుండా పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది.

అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెబుతూ వచ్చిన తాము... ఇప్పుడు మూడు రాజధానులంటూ జగన్ చేసిన ప్రకటనకు జనానికి ఏం సమాధానం చెప్పాలన్నదే ఇటు ఆళ్లతో పాటు అటు శ్రీదేవి ప్రశ్న. మంగళగిరి - తాడికొండ ప్రజలు ఇప్పుడు రాజధాని తరలిపోతోందన్న భావనతో నిజంగానే తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు.అదే సమయంలో రాజధాని అమరావతి నుంచి తరలిపోకుండా ఉండేలా ఉద్యమాన్ని ఉవ్వెత్తున సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలన్న భయంతోనే అటు ఆళ్ల - ఇటు శ్రీదేవి అజ్ఝాతంలోకి వెళ్లారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రైతులకు మద్దతుగా దీక్షలు చేద్దామంటే... పార్టీ అధిష్ఠానాన్ని - తమ ప్రియతమ నేత సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే అవుతుంది. అంటే ముందు నుయ్యి - వెనుక గొయ్యి అన్న మాటే. అందుకే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అజ్ఝాతంలోకి వెళ్లిపోయారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News