అమరావతి టూ అరసవెల్లి... పాదయాత్ర ముగించేశారు

Update: 2023-01-22 15:39 GMT
ఎలా చేశారన్నది కాదు చేశారా లేదా అన్నది ముఖ్యం. ఆ విధంగా చూస్తే అమరావతి రైతులు పాదయాత్ర ముగించేశారు. అరసవెల్లి సూర్యనారాయణ మూర్తి దయ తమ మీద ఉండాలని వారు గట్టిగా కోరుకున్నారు. ఆదిత్యునికి ప్రీతిపాత్రమైన మాఘమాసం తొలి ఆదివారమే మొక్కు చెల్లించడం మరో విశేషం. అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర గత ఏడాది సెప్టెంబర్ 12న అమరావతిలో స్టార్ట్ అయింది. దసరా పండుగ కూడా పూర్తి చేసిన తరువాత సరిగ్గా నలభై రోజులకు రామచంద్రాపురం వద్ద  పాద యాత్రకు బ్రేక్ పడింది.

పోలీసులకు ఐడెంటీ కార్డులు చూపించి యాత్ర సాగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో తర్జనభర్జన పడిన తరువాత యాత్రను ఆపేశారు. అయితే అరసవెల్లి వరకూ యాత్ర అని మొక్కుకున్నందువల్ల అది మధ్యలో ఆపకూడదని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కో  కన్వీనర్ అయిన గద్దే తిరుపతిరావు ఈ నెల 11 నుంచి రామచంద్రాపురం నుంచి యాత్రను స్టార్ట్ చేశారు. అది ఈ రోజుతో పూర్తి అయింది. ఆయన శ్రీకాకుళం లోని అరసవెల్లికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన జగన్ సర్కార్ మీద హాట్ కామెంట్స్ చేసారు. అమరావతి రాజధాని అని జగన్ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుని మరీ ఇపుడు కాదనడం న్యాయమేనా అని నిలదీశారు 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని ఒప్పుకున్నదువల్లనే జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు అని ఆయన లాజిక్ పాయింట్ తీశారు. మూడున్నరేళ్ళుగా తాము ఉద్యమం చేస్తున్నామని అయినా ప్రభుత్వం కరగకపోవడం దారుణం అన్నారు.

ఇప్పటీకైనా ప్రభుత్వం మనసు మార్చాలని సూర్యనారాయణమూర్తిని ప్రార్ధించామని అన్నారు. తాము ఏపీ రాజధాని అమరావతి అని భూములుఇచ్చామని, 28 గ్రామాల ప్రజలు 13 జిల్లాల శ్రేయస్సు కోసమే త్యాగం చేశాయని ఆయన చెప్పుకొచ్చారు. తమది స్వార్ధం కాదని ఏపీ అభివృద్ధి కోసం వేసిన ముందడుగు అని అన్నారు. పాలకులు మారినపుడల్లా రాజధాని మారకూడదు అని ఆయన స్పష్టం చేశారు.

అమరావతి ఏకైక రాజధాని అని అన్ని పార్టీలు నినదిస్తున్న నేపధ్యంలో వైసీపీ మాత్రం మూడు రాజధానులు అంటోంది. దీని మీద అనేక రకాలైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా ముందుకే అని వైసీపీ డిసైడ్ అయింది. ఈ నేపధ్యంలో అమరావతి రైతులు పంతంగా పట్టుదలగా తమ పాదయాత్రను పూర్తి చేశారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. హై కోర్టు అయితే అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అని తీర్పు ఇచ్చేసింది ఇక సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ దశలో ఉంది.

ఆ కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా రావాలనే అమరావతి రైతులు మొక్కుకుంటున్నారు. మొత్తానికి అమరావతి రాజధాని కోసం రైతుల పట్టుదల ఎలా ఉందో ఒకే ఒక్క రైతు గద్దె తిరుపతిరావు పాదయాత్ర చేసి మరీ నిరూపించారు. మరి ఆ పంతానికి పట్టుదలకు దేవస్థానం దీవెనలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సిందే.
Tags:    

Similar News