సాధారణంగా కాస్త ఆర్థిక స్థోమతతో పాటు ఆసక్తి ఉన్నవారిలో చాలా మంది ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు కోసమని విదేశాలకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారతీయ విద్యార్థుల ఫస్ట్ టాప్ ఆప్షన్స్... యూఎస్, యూకే, కెనడా అని అంటుంటారు. అయితే... ఈ లెక్క మారుతుందని, యూకే వైపు భారత విద్యార్థులు చూపు తగ్గుతోందని అంటున్నారు.
అవును... బ్రిటన్ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించే విషయంలో భారతీయ విద్యార్థులు మునుపటి ఆసక్తి చూపించడం లేదని.. చాలామంది పూర్తి విముఖత చూపుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి యూకే ఆర్థిక సంక్షోభం, అక్కడి విద్యాసంస్థలు బడ్జెట్ తో సతమతమవుతుండటం వంటివి కీలక కారణాలు అని అంటున్నారు.
దీంతో... అక్కడి యూనివర్సిటీల్లో దరఖాస్తు చేసుకునే విషయంలో అనాసక్తిగా ఉంటున్నారని.. గతంతో పోలిస్తే వీరి సంఖ్య సుమారు 20.4 శాతం తగ్గినట్లు చెబుతున్నారు. ఈ మేరకు "ఆఫీస్ ఫర్ స్టూడెంట్స్" అనే సంస్థ తాజాగా విడుదల చేసిన సర్వేలో వెల్లడించింది. ఇదే సమయంలో పలు కీలక విషయాలు వెల్లడించింది!
ఈ స్థాయిలో భారతీయ విద్యార్థులు యూకే వైపు విముఖత వ్యక్తం చేయడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయని సర్వే వెల్లడించింది. ఇందులో భాగంగా... పరిమిత ఉద్యోగ అవకాశాలు, భద్రతాపరమైన ఆందోళనలు, వీసా నిబంధనలు కఠినతరం చేయడం, ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక అల్లర్లు వంటివి కూడా ప్రధాన కారణాలు అని వెల్లడించింది!
ఇదే సమయంలో ప్రధానంగా.. విద్యాభ్యాసం పూర్తయ్యేంతవరకూ విద్యార్థులు స్టూడెంట్ నుంచి ఉద్యోగ వీసాకు మారలేకపోవడం వల్ల బ్రిటన్ లో చదువుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల్లో అనేకమంది ఆర్థిక అవసరల కోసం పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని, ఇది ప్రధాన సమస్యగా మారిందని చెబుతున్నారు.
ఈ సర్వే ఫలితాలు, నివేదికలపై ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ (ఎన్.ఐ.ఎస్.ఏ.యూ) నేషనల్ ఛైర్మన్ సనమ్ అరోరా స్పందిస్తూ... డిపెండెంట్లపై కన్జర్వేటివ్ నిషేధం, పోస్ట్ స్టడీ వర్క్ వీసాపై గందరగోళం, ఉద్యోగాలు అస్పష్టంగా ఉండటం వంటి పలు కారణాల వల్ల ఈ తగ్గుదల కనిపిస్తోందని అన్నారు!
ఇదే సమయంలో... విదేశీ విద్యార్థులు వారిపై ఆధారపడి ఉన్న జీవిత భాగస్వాములను తమతో తీసుకురావడానికి డిపెండెంట్ వీసా నిబంధనలను కఠినతరం చేయడం కూడా విద్యార్థుల సంఖ్యలో తగ్గుదలకు కారణంగా పేర్కొంటున్నారు. ఈ డిపెండెంట్ వీసా నిబంధనలు సరళతరం చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదని అంటున్నారు!