అక్రమ సంబంధమన్న డౌట్.. యోగా టీచర్ ను బతికి ఉండగానే పాతేశాడు!
ఇటీవల కాలంలో దారుణ నేరాలు.. ఘోరాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి దారుణ హత్య ఒకటి హర్యానాలో చోటు చేసుకుంది.;

ఇటీవల కాలంలో దారుణ నేరాలు.. ఘోరాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి దారుణ హత్య ఒకటి హర్యానాలో చోటు చేసుకుంది. మూడు నెలల నుంచి కనిపించకుండా పోయిన ఒక యోగా టీచర్ ను.. దారుణంగా చంపేసిన వైనం వెలుగు చూసింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే ఈ హత్య జరిగిన వైనం వెలుగు చూసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
హర్యానాకు చెందిన జగ్ దీప్ అనే యోగా టీచర్ ఒక సంస్థలో పని చేస్తుంటారు. ఇటీవల అతను కనిపించట్లేదు. దీంతో.. ఆందోళనకు గురైన అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన నిందితుడు రాజ్ కరణ్.. మరో ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్దధాన నిందితుడు రాజ్ కరణ్ మాత్రం పరారీలో ఉన్నారు.
విచారణ సందర్భంగా రాజ్ కరణ్ సూచన మేరకు.. యోగా టీచర్ ను కిడ్నాప్ చేసి హత్య చేసిన వైనాన్ని ఇద్దరు అనుమానితులు చెప్పారు. తన భార్యతో యోగా టీచర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా రాజ్ కరణ్ అనుమానించారని.. అందుకే కిడ్నాప్ చేసి చంపేయాలని సూచన చేశారని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో యోగా టీచర్ జగ్ దీప్ నోటికి ప్లాస్టర్ వేసి.. చేతులు కాళ్లూ కట్టేశామని.. అనంతరం ముందుగా తవ్విన ఏడు అడుగుల లోతు గుంతలో పాతిపెట్టినట్లుగా చెప్పటంతో పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి. బతికి ఉండగానే యోగా టీచర్ ను పాతిపెట్టి చంపినట్లుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న రాజ్ కరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానంతో ఇంత అమానుషంగా హత్య చేయించటం స్థానికంగా సంచలనంగా మారింది.