ఉప ఎన్నికలు రావని చెప్పి రేవంత్ తప్పు చేశారా?

‘ఉప ఎన్నికలు రావు’ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.;

Update: 2025-03-27 04:45 GMT
ఉప ఎన్నికలు రావని చెప్పి రేవంత్ తప్పు చేశారా?

‘ఉప ఎన్నికలు రావు’ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలతో సీఎం చిక్కుల్లో పడ్డారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు ఖాయమని.. అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంటుందన్న చర్చల వేళ.. ఉప ఎన్నికల అంశంపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను కోట్ చేస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశంపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారని.. ఆయన ఈ తరహా వ్యాఖ్యలు సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురి కాక తప్పదన్న చర్చ నడుస్తోంది. ఇలాంటి వేళ నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ చిక్కుల్లో పడనున్నారా? తన నోటి మాటలతో కోరి కష్టాల్ని తెచ్చుకుంటున్నారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ అసెంబ్లీని వేదికగా చేసుకొని సీఎం రేవంత్ ఏం మాట్లాడారు? ఏ సందర్భంలో ఉప ఎన్నికల ప్రస్తావన తెచ్చారు? కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నిస్తున్నారు.

బుధవారం హోం.. పాలనాపరమైన పద్దుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. 2014-2023 మధ్య కాలంలో విపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకుందని.. కొందరు మంత్రులు కూడా అయ్యారని.. వారెవరిపైనా అనర్హత వేటు పడలేదని గుర్తు చేశారు. ‘అప్పటి నుంచి ఇప్పటి వరకు చట్టం.. న్యాయం.. రాజ్యాంగం మారలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం ఉప ఎన్నికలు వస్తాయి? 2014-23 వరకు ఈ సభ అనుసరించిన విధానాల్నే మేమూ అనుసరిస్తాం. రూల్ బుక్ కూడా మారలేదు (తన చేతిలో ఉన్న రూల్ బుక్ ను చూపిస్తూ) వారు రాసిందే ఈ పుస్తకం. ఎలాంటి ఉప ఎన్నికలు రావు’ అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఒక పెద్దమనిషి ఉప ఎన్నికల్లో నేనే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్నారంటూ.. ‘‘ఆయన పదవిలో ఉన్నప్పుడు మంచి పంచె కట్టుకొని తిరిగారు. అలా తిరిగితే పంచె పోతుందని అనాడే హెచ్చరించా. అలా చెప్పిన నెల రోజుల్లోనే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని తీసేశారు. ఆ అమాయకుడే ఇప్పుడు వారంలో ఉప ఎన్నికలని తిరుగుతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ఉప ఎన్నికల వ్యాఖ్యల్ని మాజీ మంత్రి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ఎలా మాట్లాడతారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే.. దీనికి ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేశారు. అసెంబ్లీ లోపల మాట్లాడేందుకు సభ నుంచి రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని ఆలోచించుకొని.. న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏదైనా బహిరంగ సభలోనో.. లేదంటే ఏదైనా మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే చిక్కుల్లో పడి ఉండేవారంటున్నారు. ఇప్పటికి ఒక చిక్కు ఉందని చెప్పాలి. ఉప ఎన్నికలు రావన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై.. సుప్రీం కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ఛాన్సు ఉందంటున్నారు. అయితే.. ఉప ఎన్నికలు వస్తాయన్న సందేహంతో ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా సీఎం రేవంత్ కాస్తంత రిస్కు తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News