అమరావతి రాజధాని... షాకింగ్ రియాక్షన్... ?

Update: 2022-03-05 07:29 GMT
ఏ ప్రాంతానికైనా పాలించే భూ భాగం అంటూ ఒకటి ఉంటుంది.  ప్రతీ కుటుంబానికి  ఇల్లు చిరునామాగా ఉంటుంది. అలాగే రాజధాని చాలా ముఖ్యమైనది. ఎవరైనా ఒక రాష్ట్రానికి రావాలీ అంటే అన్ని నగరాలూ తిరగలేరు కదా.  రాజధానికే వారు తప్పక రావాలి. సో అంతటి ప్రాముఖ్యత కలిగిన రాజధాని ఏపీతో మాత్రం ఎపుడూ దాగుడుమూతలే ఆడుతోంది. ఉమ్మడి మద్రాస్ లో ఉన్నపుడు చెన్నపట్నమే మన రాజధాని అని గర్వించేవారు. ఇక ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ని చూసి మురిసిపోయారు.

ఎనిమిదేళ్ల క్రితం జరిగిన విభజన కారణంగా హైదరాబాద్ మన రాజధాని కాదు అన్నది ఇప్పటికీ ఏపీ జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో భాగ్యనగరంతో ఉన్న సెంటిమెంట్ ని కూడా కాదనుకోలేకపోతున్నారు. వాటిని మరిపించేలా ఏపీలో రాజధాని అన్నది ఇప్పట్లో ఏర్పాటు అయ్యేది కూడా కాదు, ఇక నవ్యాంధ్ర తొలి సీఎం  చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి తన వంతుగా ఏదో చేయాలని ప్రయత్నించారు. 2019లో మళ్లీ తానే వస్తాను కాబట్టి నెమ్మదిగా అంతా చేద్దామనుకున్నారు.

కానీ సీన్ రివర్స్ అయి వైసీపీ వచ్చింది. ఆ పార్టీ అమరావతిని పక్కన పెట్టేసి మూడు రాజధానులను ఎత్తుకుంది. రెండేళ్ళుగా దీని మీదనే ఏపీలో అతి పెద్ద  పోరాటం సాగుతోంది. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని అక్కడి రైతులు ఉద్యమాలు చేశారు. ఏకంగా 807 రోజుల పాటు వారు చేసిన ఉద్యమాలు ఒక వైపు ఉంటే వారికి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన మద్దతు కూడా చాలానే ఉంది. మొత్తానికి హై కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీకి అమరావతి ఏకైక శాశ్వత రాజధాని అని నిర్ధారణ అయింది.

దాని మీద విపక్షాలు సంతోషించాయి. తెలుగుదేశం అయితే ఎగిరి గంతేసింది. అదే టైమ్ లో అమరావతి ప్రాంతంలో జనాలు  టపాసులు కూడా పేల్చుకుని సంబరాలు చేసుకున్నారు. మరి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏపీకి రాజధాని ఏదీ అన్న చర్చ అడుగడుగునా వచ్చిన వేళ‌ ఇదే మీ రాజధాని, ఇక్కడే అభివృద్ధి చేయాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం అంటే చిన్న విషయం కాదు.

పైగా ఈ తీర్పు అమరావతి రైతులకో విపక్ష పార్టీలకో మాత్రమే కాదు, అయిదు కోట్ల ఆంధ్రులకు సంబంధించినది. మరి ఈ తీర్పు మీద ఏపీ జనాల రియాక్షన్ ఏమైనా ఉందా అంటే జీరో అని జవాబు వస్తోంది. ఇంతటి కీలకమైన తీర్పు వచ్చిన నేపధ్యంలో ఏపీ జనాలు అయితే పెద్దగా స్పందించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కేవలం అమరావతి పరిసర ప్రాంతాలలో రైతుల మధ్యనే ఆనందోత్సాహలు కనిపించాయి.

మరి ఈ రాజధాని ప్రకటన కేవలం వారికే సంతోషాన్ని ఇచ్చిందా. లేక వారికి మాత్రమే అమరావతి రాజధాని పరిమితం అయిందా అన్న చర్చ కూడా ఒక వైపు సాగుతోంది. అంత దాకా ఎందుకు సమీపంలో ఉన్న గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో కూడా పెద్దగా జనాలు హుషార్ చేసింది లేదు.

మరి దానికి కారణాలు ఏంటి అన్న విశ్లేషణ కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అమరావతి మన రాజధాని అని చెప్పిన నాడు కూడా ఏపీ జనాల నుంచి పెద్దగా స్పందన లేదు, ఒక రాజధాని కాదు, మూడు చేస్తున్నామని జగన్ సర్కార్ వరాలు ఇచ్చిన‌పుడూ కూడా ఆయా ప్రాంతాల వారూ ఎవరూ బయటకు వచ్చి చిందేయలేదు. ఇపుడు మళ్లీ అమరావతి ఒకే ఒక  రాజధాని  అన్న నాడు కూడా అదే విధంగా సైలెంట్ గానే అయిదు కోట్ల ఆంధ్రులు ఉన్నారు.

దీన్ని బట్టి ఏపీలో అమరావతి రాజధాని మొత్తం జనాల సెంటిమెంట్ గా లేదు అన్నది ఒకటి అర్ధమవుతోంది. అదే టైమ్ లో హైదరాబాద్ తో ఉన్న అటాచ్ మెంట్ అలాగే కంటిన్యూ కావడం వల్ల కూడా ఏపీకి ఎక్కడ రాజధాని ఉంటేనేంటి అన్న నిర్వేదం కూడా కనిపిస్తోంది.  దాంతో ఇది రాజధాని వ్యవహారాన్ని రైతులకు ప్రభుత్వానికి జరిగిన ఒప్పందంగానే చూస్తున్నారు. అలాగే దీన్ని రాజకీయ క్రీడగా కూడా చూస్తున్నారు.

మొత్తానికి ఏపీకి రాజధాని ఇదిగో తెచ్చిపెడుతున్నామని నాయకులు చెప్పినా కూడా జనాలు పట్టించుకోవడంలేదూ అంటే అది కచ్చితంగా పాలకుల తప్పుగానే చూడాలి. విభజన జరిగిన ఎనిమిదేళ్ళ తరువాత కూడా హైదరాబాద్ మీదనే మక్కువ కనబరుస్తున్నారు అంటే తప్పు ఎక్కడో జరిగింది అనే అనుకోవాలి.  

ఇంత సుదీర్ఘ టైమ్ లో కూడా ఏపీ రాజధానికి ఒక రూపూ షేపూ తీసుకురాకపోవడం వల్లనే జనాల మొగ్గు ఇటు వైపు లేదు అని అర్ధమవుతోంది. మొత్తానికి రాజధాని విషయంలో వారూ వీరూ గుండెలు బాదుకుంటున్నారు కానీ ఏపీలోని సామాన్యుడు మాత్రం ఫుల్ సైలెంట్  అన్నట్లుగానే సీన్ ఉంది.
Tags:    

Similar News