అమరావతి  రైతుల మైండ్ సెట్ మారాలా...జగన్ మాటల వెనక ఏముంది...?

Update: 2022-12-01 00:30 GMT
అమరావతి రాజధాని రైతులు వేయి రోజులుగా పోరాటం చేస్తున్నారు. వారు తమ పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళారు. అదే సమయంలో వారు న్యాయ పోరాటం చేసి హై కోర్టులో కేసు గెలిచారు. ఇపుడు సుప్రీం కోర్టు పరిధిలో అమరావతి రాజధాని కేసు విచారణ ఉంది. తీర్పు ఎపుడు వస్తుంది అన్నది చూడాలి.

ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కీలకమైన అయిదు విషయాలలో ఏపీ ప్రభుత్వానికి ఊరటను ఇచ్చే విధంగా స్టే ఇచ్చింది. దాంతో వైసీపీలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అది తాజాగా మదనపల్లె సభలో జగన్ ప్రసంగం ద్వారా వ్యక్తం అయింది.

ఆయన జగనన్న విద్యా దీవెన పధకం కింద నాలుగవ విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ అమరావతి రాజధాని  రైతుల  మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అమరావతి రైతుల ఆలొచనలు మారాలని ఆయన కోరుకున్నారు. వారి బుద్ధి మారాలని దేవుడిని కోరుకుంటున్నాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

అమరావతి రైతులు తమ భూములలోనే రాజధాని కట్టాలన్న ఆలోచనల నుంచి బయటకు రావాలని జగన్ కోరడం విశేషం. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే సామాజిక సమతూల్యత దెబ్బతింటుందని భావించే వారికి మంచి బుద్ధిని దేవుడు ప్రసాదించాలని ఆయన కోరడమూ గమనార్హం. అదే విధంగా విపక్షాలను ఆయన నిందించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే వారు అడ్డుపడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

మొత్తానికి ఆయన ప్రసంగం లో కొంత భాగం అమరావతి రాజధాని రైతుల చుట్టూ తిరగడం వెనక వ్యూహం ఏమై ఉంటుంది అన్న చర్చ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో సుప్రీం కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆయన అలా అంటున్నారా లేక అమరావతి ఫైనల్ గా రాజధాని అవుతుంది అన్నదేదో మనసులో ఉండబట్టి అలా మాట్లాడారా అన్న దాని మీద అయితే ఎవరికీ క్లారిటీ లేదు.

పైగా జగన్ రాయలసీమ గడ్డ మీద నుంచి అమరావతి రైతులు మారాలని సూచించడం కూడా కీలకమైన పరిణామం. ఆ విధంగా తాము అన్ని ప్రాంతాల మధ్య అన్ని కులాల మధ్య సమతూల్యతకు కృషి చేస్తూంటే విపక్షాలతో పాటు అమరావతి రైతులు ఏకైక రాజధాని కోరుతున్న వారు అడ్డుపడుతున్నారు అన్న విషయాన్ని ఆయనా జనంలోకి పంపాలనుకుంటున్నారు అని అంటున్నారు.

 ఏది ఏమైనా రాజధాని విషయాన్ని ఒక బిగ్ ఇష్యూగా చేసుకోవాలని వైసీపీ చూస్తోంది అని ప్రచారంలో ఉంది. దానికి ఆయన రాయలసీమ గడ్డ మీద నుంచి స్టార్ట్ చేశారు అని అంటున్నారు. మరి దీని మీద అమరావతి రైతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. వారి మైండ్ సెట్ మారాలని జగన్ దేవుడిని కోరుకున్నారు. మరి అదే దేవుడిని అమరావతి రైతులు మరేమి కోరుకుంటారో. అది కదా అసలైన పాయింట్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News