కరోనా: మూడోవంతు కేసులు - నాలుగోవంతు మరణాలు...అక్కడే!

Update: 2020-04-30 17:30 GMT
కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. కొద్ది రోజులుగా అక్కడ మృత్యుఘోష వినిపిస్తోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్క రోజులోనే వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయిన దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా కరోనా వ్యాధి లో కూడా అగ్రస్థానంలో నిలిచింది.

కాగా , ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కరోనా విజృంభణకు అమెరికాలో 60 వేల మందికి పైగా బలయ్యారు. వియత్నాంతో జరిగిన యుద్ధంలో మరణించిన 58,220 మంది సైనికుల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ. కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 10,48,834కి చేరింది.

ప్రపంచంలో నమోదైన 31,86,458 కరోనా పాజిటివ్‌ కేసుల్లో మూడోవంతు అమెరికాలోనే నమోదయ్యా. ప్రపంచ దేశాల్లో కరోనా మరణాలు 2,25,521. నాలుగో వంతు అంటే 60 వేలకి పైగా ఇక్కడే నమోదయ్యాయి. అయితే , ఇప్పటికే అమెరికాలో కొన్ని ప్రాంతాలలో కరోనా తగ్గుముఖం పట్టింది. ఆ రాష్ట్రాల్లో లాక్ ‌డౌన్‌ ఆంక్షలను తొలగిస్తున్నారు. కరోనాపై పోరులో కచ్చితంగా విజయం సాధిస్తామని, దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్తున్నారు. అమెరికాలో గడ్డుకాలం ముగిసిందని, లక్షలాది మంది దేశ ప్రజలు త్యాగాలు చేశారన్నారు. కరోనా నేపథ్యంలో 127 దేశాల నుంచి 71,538 మంది అమెరికన్లను స్వదేశానికి రప్పించామని విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్‌ ఓర్టగస్‌ తెలిపారు.
Tags:    

Similar News