40 ఏళ్ల గరిష్టానికి అమెరికా ద్రవ్యోల్బణం..

Update: 2022-10-14 07:50 GMT
అమెరికా అతలాకుతలం అవుతోంది. అగ్రరాజ్యం ధరాఘాతంతో ఆగమాగమవుతోంది. ఎన్నడూ లేనంత స్థాయిలో ధరలు పెరిగి ప్రజలు బావురుమంటున్నారు. అమెరికాలో ధరలు పెరుగుతూనే ఉన్నందున అమెరికా ప్రజలు కొనడానికి జంకుతూ మధ్యతరగతి వారంతా అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగడంతో ఈ పరిస్థితి దాపురించింది. ధరలన్నీ చుక్కలనంటుతున్నాయి..

ఆహారం , ఇంధన ధరలు మినహా ప్రధాన ద్రవ్యోల్బణం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్‌లో 6.6 శాతం పెరిగిందని అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ గురువారం తెలిపింది. ఇది ఆగస్ట్‌లో 6.3 శాతం నుండి కూడా పెరిగింది. 1982 నుండి ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. అధిక ధరల కట్టడికి ఫెడరల్ బ్యాంక్ 75 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు పెంచినా ధరల్లో పెద్ద మార్పు రాకపోవడం గమనార్హం.

అధికారిక డేటా ప్రకారం.. నెలవారీ ప్రాతిపదికన, కోర్ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 0.6 శాతం పెరిగింది. అమెరికాలో వస్తు సేవలకు డిమాండ్ అధికంగా ఉండడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. వడ్డీ రేట్ల పెంపుతో దీనికి చెక్ పెట్టేందుకు ఫెడరల్ రిజర్వ్ రంగంలోకి దిగింది.

ఉద్యోగకల్పనపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఉద్యోగకల్పనలో వృద్ధి రేటు ఏకంగా సగానికి పడిపోతోంది. ఇక వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచి నెలనెలా 1,75,000 ఉద్యోగావకాశాలు కనమరుగవుతాయి. 2023 మొత్తం ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని బ్యాంకు అంచనావేస్తోంది.

గతనెలలో అమెరికా ప్రజలకు కొత్తగా 2,63,000 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగ కల్పన రేటు కాస్తంత మందగించినా గతనెలలో మాత్రం మంచి గణాంకాలే నమోదయ్యాయి. నిరుద్యోగిత రేటు కూడా 3.5 శాతానికి పరిమితమైంది. వచ్చే ఏడాది ఈ రేటు 5.5 శాతానికి ఎగబాకే అవకాశం ఉంది.

ఈ ద్రవ్యోల్బణం కారణంగా.. అమెరికా స్టాక్ ఫ్యూచర్‌లు పడిపోయాయి. ద్రవ్యోల్బణం డేటా అగ్రస్థానంలో ఉన్న తర్వాత ట్రెజరీ దిగుబడులు పెరిగాయి. డాలర్ కూడా పుంజుకుంది. ఇది ప్రపంచ మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. వడ్డీ రేట్లు పెరగడం.. డాలర్ పెరగడంతో విదేశాలు మారకం కోసం అధిక డబ్బులు వెచ్చించాల్సి రావడంతో ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News