అమెరికా విమానం ఆగింది.. 4 వేల సర్వీసులు డౌన్

Update: 2023-01-11 15:38 GMT
అమెరికా అంటే.. చీటికీమాటికి ప్రయాణాలు.. అది కూడా విమానాల్లో. ఆ చివరన ఉన్న కాలిఫోర్నియా నుంచి ఈ చివరన ఉన్న న్యూయార్క్ వరకు విహంగాల సందడే సందడి. ఒక్క మాటలో చెప్పాలంటే అభివ్రద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో రైళ్ల ద్వారా ప్రజా రవాణా ఎలాగో అగ్ర రాజ్యం అమెరికాలో విమానాలు అలాగ. సొంతంగా విమానాలు ఉన్న వ్యక్తులు అమెరికాలో కోకొల్లలు. అలాంటి అమెరికాలో బుధవారం విమాన సర్వీసుల్లో పెద్ద గందరగోళం రేగింది.

ఒకటీ రెండు కాదు ఏకంగా నాలుగు వేల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇదో విమానం వార్త ఇటీవల విమానాలకు సంబంధించిన ఏదో ఒక వార్త మీడియాలో వస్తోంది. పెద్ద వయసు మహిళపై ఓ యువ ఉన్నతోద్యోగి మద్యం మత్తులో మూత్రం పోయడం, ప్రయాణికులను ఎక్కించుకోకుండానే విమానం వెళ్లిపోవడం, ఆహారంలో రాయి రావడం.. ఇలా అనేక రకాల కథనాలు మీడియాకు ఎక్కుతున్నాయి. తాజాగా అమెరికా అంతటా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీనికి సాంకేతిక సమస్య కారణమని చెబుతున్నారు. ఈ పరిణామంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫెడరల్ ఏవియేషన్ లోనే లోపం..

భారత్ లో విమాన రాకపోకలను నియంత్రించే డీసీజీఏ ఎలాగో అమెరికా లో విమాన సర్వీసులకు ఫెడరల్‌ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ అలా. కానీ, ఎఫ్ఎఏల సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. దీంతో అమెరికా అంతటా సేవలు నిలిచిపోయాయి. విమానాలన్నీ ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల  గురించి విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ఎఫ్‌ఏఏ.. ఎయిర్‌లైన్లకు ఇచ్చే నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌ మిషన్స్‌) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఎఫ్‌ఏఏ ట్విటర్‌లో వెల్లడించింది. అయితే, దీన్ని పునరుద్ధరించడంలో పురోగతి సాధిస్తున్నామని.. పలుచోట్ల క్రమంగా విమాన సేవలు పునఃప్రారంభమవుతున్నట్టు ఎఫ్‌ఏఏ తాజాగా ప్రకటించింది. విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నామని, అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని సోషల్‌మీడియా

వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకర్ ప్రకారం.. ఇప్పటివరకు అమెరికాలో, దాని వెలుపలకు సంబంధించి మొత్తం దాదాపు 4వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. హాట్‌లైన్‌ను యాక్టివేట్ చేసినట్లు అమెరికా రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. విమానాలు నడుస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. భారీ జాప్యంతో ఉన్నాయని మరికొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎయిర్‌మిషన్స్‌ సిస్టమ్‌ను పూర్తిస్థాయిలో  పునరుద్ధరించేందుకు ఎఫ్‌ఏఏ పనిచేస్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు. విమానాల భద్రతకు సంబంధించిన  సమాచారాన్ని ఏజెన్సీ ధ్రువీకరించేందుకు వీలుగా ఉదయం 9గంటల (స్థానిక కాలమానం ప్రకారం) వరకు అన్ని దేశీయ విమాన సర్వీసులు బయల్దేరకుండా నిలుపుదల చేయాలని ఆయా విమానయాన సంస్థలను ఎఫ్‌ఏఏ ఆదేశించింది.

ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)లో తలెత్తిన సాంకేతిక లోపం తలెత్తిన పరిస్థితులను అమెరికా రవాణా మంత్రి  ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు వివరించారని శ్వేత సౌధం వెల్లడించింది. సైబర్‌ దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అయితే, దీని వెనుక కారణాలపై పూర్తి విచారణ జరపాలని ఆయన ఆదేశించినట్టు శ్వేత సౌధం ప్రెస్‌ కార్యదర్శి ట్విటర్‌లో తెలిపారు. అమెరికాలో ఈరోజు 21,000కు పైగా విమాన సర్వీసులు అందించాల్సి ఉంది. వీటిలో అత్యధికం దేశీయంగా సేవలందించేవే. అలాగే, ఏవియేషన్ డేటా సంస్థ సిరియమ్ ప్రకారం 1,840 అంతర్జాతీయ విమానాలు ఎగరాల్సిఉంది.

అమెరికాలో సేవలందించే విమానాల్లో దాదాపు 550కి పైగా బుధవారం రద్దయినట్టు ఆన్‌లైన్‌ ఫ్లైట్‌ ట్రాకర్‌ FlightAware తెలిపింది. విమానాలు నిలిచిపోయిన నేపథ్యంలో ఎయిర్ మిషన్స్ సిస్టమ్‌ను పునరుద్ధరించడంలో పురోగతి సాధిస్తున్నట్టు ఎఫ్‌ఏఏ తెలిపింది. పలుచోట్ల విమాన సర్వీసులు క్రమంగా పునఃప్రారంభమవుతున్నాయని వెల్లడించింది. ఆ ప్రాంతాల్లో ఎయిర్ ట్రాఫిక్ రద్దీ కారణంగా న్యూయార్క్‌ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం, అట్లాంటా విమానాశ్రయాల్లో విమానాలు బయల్దేరడం పునఃప్రారంభమైందని.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9గంటల సమయానికల్లా ఇతర విమానాశ్రయాల నుంచి కూడా విమాన సర్వీసులు బయల్దేరతాయని భావిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం గగనతలంలో ఉన్న విమానాలు సురక్షితంగా ల్యాండ్‌ అవుతాయని పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News