యూరప్ కు అమెరికా అత్యాధునిక ఎఫ్35 యుద్ధ విమానాలు.. ఎందుకంటే?

Update: 2022-05-05 10:30 GMT
ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా సమీకరణాలన్నీ మారిపోయాయి. ఉక్రెయిన్ కు అమెరికా, యూరప్ దేశాలు సహాయం చేసి రష్యాను ముప్పుతిప్పలు పెడుతుండడంతో ఈ యుద్ధం ముగియడం లేదు. దీంతో మూడో ప్రపంచ యుద్ధ భయాలు ప్రపంచంలో రావచ్చు అంటూ రష్యా చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది.

రెండు నెలల క్రితం ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ ముగియలేదు.రోజురోజుకు తీవ్రం అవుతోంది. రష్యాపై పాశ్చాత్య దేశాలు అనేక ఆర్థిక ఆంక్షలు విధించినా  తగ్గేది లేదు అన్నట్లుగా రష్యా చెలరేగుతోంది.పైగా తమకు ఎలాంటి హానీ అయినా తలపెట్టాలని నాటో చూస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ హెచ్చరికలు పంపుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా బెదిరింపులకు అమెరికా అలెర్ట్ అయ్యింది. యూరప్ దేశాలకు మద్దతుగా తన వద్దనున్న అత్యున్నత యుద్ధ విమానం ఎఫ్35లను యూరప్ కు పంపింది. వెర్మాండ్ వైమానిక స్థావరం నుంచి 8 ఎఫ్35 విమానాలు తాజాగా జర్మనీకి చేరుకున్నాయి.

ఎఫ్35 యుద్ధ విమానాలను ప్రపంచంలోనే అత్యంత ఆధునాతన, ఖరీదైన యుద్ధ విమానాలుగా పరిగణిస్తారు. రష్యాసరిహద్దు నుంచి నాటో దేశాల గగనతలాన్ని ఇవి కాపలా కాయనున్నాయి. విదేశాల్లో అమెరికా ఎఫ్35లను మోహరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

పరిస్థితులు చూస్తుంటే రష్యాతో తేల్చుకునేందుకే అమెరికా, యూరప్ దేశాలు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ కు సాయం అందిస్తున్న దాని పొరుగు యూరప్ దేశాలపైకి దండెత్తడానికి రష్యా రెడీ అవుతోంది.

దీంతో వీరికి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. రష్యా తోకజాడిస్తే యుద్ధం మొదలుపెట్టడానికి అమెరికా, యూరప్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News