హ‌ర్ట్ అయిన‌ అమిత్‌ షా మీడియాతో ఏం చెప్పారంటే...

Update: 2017-10-14 06:45 GMT
దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తించడ‌మే కాకుండా...బీజేపీని ఇర‌కాటంలో ప‌డేసిన తన కుమారుడు జయ్ షా  నేతృత్వంలోని కంపెనీ అవినీతి క‌థ‌నంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎట్ట‌కేల‌కు స్పందించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జయ్ షా నేతృత్వంలోని కంపెనీలు ఒక్క ఏడాదిలోనే తమ టర్నోవర్‌ ను 16,000 రెట్లు పెంచుకున్నాయంటూ ది వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. జయ్ షా కంపెనీలు తమ టర్నోవర్‌ ను అనూహ్యంగా పెంచుకున్న అంశంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు డిమాండ్‌ చేశాయి. ఆశ్రిత పెట్టుబడులకు జయ్ షా కంపెనీలు మంచి ఉదాహరణ అని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. దాంతో, అమిత్‌ షా కాంగ్రెస్‌ పై ప్రతి దాడికి దిగారు. ఓ న్యూస్‌ ఛానల్‌ తో అమిత్‌ షా మాట్లాడుతూ ఎలాంటి అవినీతికీ పాల్పడలేదని అన్నారు.

కాంగ్రెస్‌ పై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయని..వారు ఎప్పుడైనా క్రిమినల్‌ పరువు నష్టం దావా లేదా రూ.100 కోట్లకు సివిల్‌ పరువు నష్టం దావా వేశారా..? అంటూ అమిత్‌ షా ప్రశ్నించారు. ఓ కంపెనీకి టర్నోవర్‌ పెరిగినంత మాత్రాన లాభాలు వచ్చినట్టు కాదని అమిత్‌ షా అన్నారు.

బోఫోర్స్ ఒప్పందంలో మాదిరిగా జయ్ షా కంపెనీ ఎలాంటి కమిషన్ తీసుకోలేదని ఆయన కాంగ్రెస్‌ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జయ్ షా కంపెనీ బియ్యం - చిరు ధాన్యాల వంటి వాటి వ్యాపారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ రూ. 80 కోట్ల వ్యాపారం చేసిందని వారు అంటున్నారని, అయితే రూ. 1.5 కోట్ల నష్టం వచ్చిన విషయాన్ని వారు ఎందుకు చెప్పడం లేదని అమిత్ షా అన్నారు. ఈ వ్యాపారంలో ఎక్కువ టర్నోవర్ - తక్కువ లాభం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో మనీలాండరింగ్ ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు.  తన కుమారుని కంపెనీ రూ.80 కోట్లు టర్నోవర్‌ సాధించిన సమయంలోనూ రూ.1.5 కోట్లు నష్టపోయిందని అమిత్‌ షా అన్నారు. చెల్లింపులన్నీ చెక్కుల ద్వారానే జరిగాయని, మనీ లాండరింగ్‌ కు అవకాశం లేదని అమిత్‌ షా అన్నారు. హామీ లేకుండా జయ్‌ షా కంపెనీలు అప్పులు పొందిన అంశంపై మాట్లాడుతూ విశ్వసనీయత ఆధారంగా ఇచ్చారంటూ అమిత్‌ షా సమర్థించుకున్నారు. కాగా,  వైర్‌ పై జయ్ షా ఇప్పటికే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.

మ‌రోవైపు ఒక ఏడాది వ్యవధిలోనే రూ.50 వేలు ఉన్న వ్యక్తి రూ.80 కోట్లు ఎలా సంపాదించవచ్చో అమిత్‌ షా తనయుడు ప్రజలకు చెబితే అందరూ సంపన్నులు అవుతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమిత్‌ షా తనయుడుకి గతేడాది రూ.50వేలు మాత్రమే ఆదాయం ఉందని అయితే అది ఏడాదిలో రూ.80 కోట్లు ఎలా అయ్యిందన్నారు. తమది అవినీతి రహిత ప్రభుత్వమని చెప్పుకుంటున్న ప్రధాని మోడీ మాటల్లో ఏమాత్రం వాస్తవముందో అమిత్‌షా తనయుడి సంపాదన చూస్తే అర్థమవుతుందన్నారు. బీజేపీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
Tags:    

Similar News