ముందస్తుకు షా ముందుండి న‌డిపిస్తాడ‌ట‌!

Update: 2018-09-05 05:50 GMT
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ముంద‌స్తుగా  ఎన్నిక‌లు వ‌చ్చే దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం రేపు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌ (క‌చ్ఛితంగా చెప్పాలంటే మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల నుంచి 2 గంట‌ల మ‌ధ్య‌లో) వేళ అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు.  ముంద‌స్తుపై కేసీఆర్ నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై ఇప్ప‌టికే ఒక క్లారిటీ వ‌చ్చిన వేళ‌.. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహ ర‌చ‌న‌లో ప‌డింది.

మిగిలిన పార్టీల ముచ్చ‌ట ఒక ఎత్తు అయితే.. టీఆర్ఎస్‌.. బీజేపీ మ‌ధ్య పోరు ఏ తీరులో ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తాను ముంద‌స్తుకు వెళితే వ‌చ్చే అడ్డంకుల్ని గుర్తించిన సీఎం కేసీఆర్ రెండు వారాల కింద‌ట ఢిల్లీకి వెళ్లి.. అక్క‌డే ఉండి మ‌రీ అన్ని విష‌యాల మీద స్ప‌ష్ట‌త తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు స‌జావుగా జ‌రిగేందుకు వీలుగా ప్ర‌ధాని మోడీతో సీఎం కేసీఆర్ ముంద‌స్తు భ‌రోసా తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీల మ‌ధ్య ఎన్నిక‌ల పోరు ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇరువురు నేత‌ల మ‌ధ్య‌ ముంద‌స్తు ఒప్పందం జ‌రిగిన‌ట్లుగా సాగుతున్న ప్ర‌చారానికి తెర దించేలా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే తానే స్వ‌యంగా రంగంలోకి దిగుతాన‌ని పార్టీ నేత‌ల‌తో అమిత్ షా స్వ‌యంగా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌రులో ఎన్నిక‌లు జ‌రిగే రాజ‌స్థాన్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. రాష్ట్రాల‌కు బీజేపీ ముఖ్య‌మంత్రులు ఉన్నార‌ని.. అక్క‌డి ప్ర‌చార బాధ్య‌త‌లు వారు చూసుకుంటార‌ని.. తెలంగాణ‌లో మాత్రం తానే స్వ‌యంగా రంగంలోకి దిగ‌నున్న‌ట్లు వ్యాఖ్యానించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో పార్టీ విజ‌యంపై షా ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఎలాంటి క్యాడ‌ర్ లేని త్రిపుర‌లోనే ప‌క్కా వ్యూహంతో విజ‌యం సాధించామ‌ని.. అలాంట‌ప్పుడు బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్న తెలంగాణ‌లో విజ‌యం ఎందుకు సాధ్యం కాద‌న్న మాట‌ను షా సంధిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. టీఆర్ఎస్ తో సీరియ‌స్ ఫైట్ చేయ‌నున్నామ‌ని.. వార్ మొద‌లైన‌ట్లేన‌ని.. పార్టీ నేత‌లు త‌మ వంతుగా పోరాటం చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఈ నెల 12 లేదంటే 15 నుంచి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి తాను ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని షురూ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రానున్న మూడు నెల‌ల్లో ప్ర‌తి ప‌ది రోజుల‌కు ఒక‌సారి చొప్పున నెల‌కు మూడుసార్లు తాను తెలంగాణ‌కు రానున్న‌ట్లు చెప్ప‌ట‌మే కాదు.. తెలంగాణ ఎన్నిక‌ల బాధ్య‌త‌ను తానే చేప‌ట్ట‌నున్న‌ట్లుగా వెల్ల‌డించ‌టం గ‌మ‌నార్హం. షా తాజా మాట‌లు చూస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్ని క‌మ‌ల‌నాథులు ఎంత‌మాత్రం లైట్ గా తీసుకోవ‌టం లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఒక‌వేళ అదే జ‌రిగితే.. ముంద‌స్తుతో భారీ ల‌బ్థి పొందాల‌ని భావిస్తున్న గులాబీ ద‌ళాలు విజ‌యం కోసం చెమ‌ట‌లు కార్చాల్సి వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News