అమిత్ షా తెలంగాణ టూర్ చూస్తే.. ఆ సామెత గుర్తుకు రావాల్సిందే

Update: 2022-08-22 05:30 GMT
'సింగడు అద్దంకి పోనూ పోయాడు రానూ వచ్చాడు' అన్న పాత సామెతను గతంలో తరచూ వాడేవారు. మునుగోడు సమర భేరీ సభ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన తాజాగా అలానే సాగినట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడు అందరూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మునుగోడు ఉప పోరుకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వకుండా.. కొసరు అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చర్చ జరుగుతోంది. ఆదివారం తెలంగాణకు వచ్చిన అమిత్ షా.. ఆయన ఉన్న కొద్ది గంటలు బిజీబిజీగా గడపటంతోపాటు.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆయన ప్రధాన టార్గెట్ అయిన సమర భేరీ సభకు హాజరైనప్పటికీ.. ఆ అంశాల మీద చర్చ జరిగటానికి బదులుగా ఆయన వెళ్లి కలిసిన రామోజీరావు అంశం.. రాత్రి పొద్దుపోయిన తర్వాత తనను కలిసేందుకు వీలుగా ప్లాన్ చేసి పిలిపించిన జూనియర్ ఎన్టీఆర్ అంశమే ఎక్కువగా ఫోకస్ అయ్యింది. మనుగోడులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సభ తర్వాతి రోజునే బీజేపీ సభను నిర్వహించిన వేళ.. ఆయనేం అంశాల్ని ప్రస్తావిస్తారు? కేసీఆర్ సర్కారు మీద ఆయన చేసే విమర్శలు.. ఆరోపణలు ఏమిటి? అన్నదాని మీదనే అందరి ఆసక్తి ఉంది.

అందుకు భిన్నంగా రామోజీ రావును కలిసే ప్రోగ్రాం.. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కలిసే వైనంపైనే జనం ఫోకస్ ఎక్కువగా సాగినట్లుగా చెబుతున్నారు. దీంతో.. సమర భేరి సభ తో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. సభలో అమిత్ షా ప్రస్తావించిన అంశాల మీద ఎవరూ పట్టించుకున్నది లేదు. అన్నింటికి మించి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నారన్న దానిపై అందరి ఆసక్తి వ్యక్తమైంది.

దీంతో.. ఆయన ఎందుకు కలుస్తున్నారు? ఆయన కలయికతో ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకునే పరిణామాలు ఏమిటి? అన్నదే హైలెట్ అయ్యింది. దీంతో.. మునుగోడు సభ ఉద్దేశం.. దాని లక్ష్యం పక్కకు వెళ్లినట్లుగాచెబుతున్నారు. బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అమిత్ షాను తారక్ కలవటం వల్ల తెలంగాణలో పార్టీకి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

దాన్ని బలం చేకూరేలా.. లాజిక్ సరిపోయే సమాధానాన్నిమాత్రం చెప్పలేకపోవటం గమనార్హం.
ఇదంతా చూస్తే.. అమిత్ షా తెలంగాణ ఎందుకు వచ్చారు? వచ్చిసాధించిందేమిటి? ఆయన భేటీలతో మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి కలిసి వచ్చే ప్రయోజనం ఎంతన్న దానిపై బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్ షా తాజా పర్యటన చూసినప్పుడు అసలు ఎక్కడికో పోయి.. కొసరు అంశాలే ఎక్కువగా నిలిచాయన్న మాట వినిపిస్తోంది.  మరీ వాదనలో వాస్తవం ఎంతన్నది కాలమే సమాధానం చెప్పాలి.
Tags:    

Similar News