మర్చిపోలేని అనుభవాన్ని సీజేఐకు మిగిల్చిన అమరావతి రైతులు

Update: 2021-12-27 04:28 GMT
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు తాజాగా లభించిన స్వాగతాన్ని ఆయన ఎప్పటికి మర్చిపోలేరేమో? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన చాలా ప్రాంతాల్లో తిరిగి ఉండొచ్చు. కానీ.. అమరావతి రైతుల అపూర్వ స్వాగతం ఆయన మదిలో అలా నిలిచిపోతుందని చెప్పాలి.

క్రమశిక్షణకు మారుపేరుగా.. ఎవరికి వారు మానవహారంగా మారి.. మూడు కిలోమీటర్ల మేర.. స్వాగతాన్ని పలికిన తీరు.. ప్లకార్డులు పట్టుకొని.. భారీఎత్తున నినాదాలు చేస్తూ.. పూలవర్షం కురిపించిన తీరు మాటల్లో వర్ణించలేనిది.

అమరావతి ప్రాంతంలో నిర్మించిన ఏపీ హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన సీజేఐకు అపూర్వ స్వాగత సత్కారాన్ని పలికారు అమరావతి రైతులు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది రైతులు ఆదివారం ఉదయం 10 గంటలకే పెద్ద ఎత్తున రాయపూడి.. నేలపాటు తదితర ప్రాంతాలకు చేరుకున్నారు.

మధ్యాహ్నం 2.45 గంటల వేళలో వచ్చే జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికేందుకు వారు వెయిట్ చేశారు. రాయపూడి కూడలి మొదలు నేలపాడులో ఉన్న హైకోర్టు ప్రాంగణం వరకు ఉన్న మూడు కిలోమీటర్ల మేర మానవహారంగా నిలబడి.. పూలు జల్లుతూ స్వాగతం పలికారు.

కొందరు మహిళలు దూరం నుంచే ఆయనకు హారతులు ఇవ్వగా.. వేలాది మంది నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ‘రైతు పుత్రుడా.. ధర్మ రక్షకుడా.. హక్కులకు దిక్కులేని చోట మీరే న్యాయానికి దిక్సూచి.. రైతుబిడ్డ కష్టం.. సామాన్యుడికి దక్కుతున్న న్యాయం’ లాంటి నినాదాలు.. జస్టిస్ రమణ చిత్రాలతో కూడిన ప్లకార్డుల్ని ప్రదర్శిస్తూ.. వెల్ కం చెప్పారు. మొత్తంగా ఆయనకు పలికిన స్వాగత సత్కారాలు ఆయన మదిలో చెరగని ముద్ర వేసేలా చేశారు.


Tags:    

Similar News