చిన్నమ్మకు చురకేసిన రీల్ విలన్

Update: 2016-12-16 07:40 GMT
అమ్మ తర్వాత అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్న చిన్నమ్మకు ఊహించని పంచ్ పడింది. అమ్మకు ఏ విధంగా అయితే.. వంగి వంగి సాష్టాంగ నమస్కారాలు చేసే వారో.. అదే రీతిలో చిన్నమ్మకు సైతం నమస్కారాలు పెట్టటం చూస్తున్నదే. అమ్మ మరణం సందర్భంగా ప్రకటించిన సంతాప దినాలు కూడా పూర్తి కాక ముందే.. అధికారం మొత్తం తన హస్తగతం చేసుకునేందుకు చిన్నమ్మ చేస్తున్న ప్రయత్నాల్ని అందరూ చూస్తున్న వారే కానీ.. ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడింది లేదు.

అంతకు మించి.. చిన్నమ్మ గౌరవ మర్యాదలకు ఏ మాత్రం తగ్గని రీతిలో వ్యవహరిస్తూ.. ఆమె మనసును దోచుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేతలకు విరుద్ధంగా.. ఆ పార్టీ కార్యకర్త.. సినీ నటుడిగా సుపరిచితుడైన రీల్ విలన్ ఆనంద్ రాజ్ వేసిన చురకలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమ్మ పోయిన విషాదంలో అందరూ ఉన్న వేళ.. పవర్ కోసం చిన్నమ్మ ప్రయత్నాల్ని సున్నితంగా స్పృశిస్తూ ఆయన చేసిన విమర్శలు చూసినప్పుడు.. ఈ మాత్రం ధైర్యం చేసే వారు అన్నాడీఎంకేలో ఉన్నారే అనుకోవాల్సిందే.

ఇంతకీ ఈ ఆనంద రాజ్ ఎవరు? అన్న ప్రశ్న వేసుకుంటే.. పది పదిహేనేళ్ల క్రితం సినిమాల్లో విలనిజాన్ని పండించి.. నాటి అగ్రహీరోలందరి సినిమాల్లో నటించిన ఆయన్ను ఫోటో చూస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. రీల్ విలన్ గా సుపరిచితుడైన ఆనందరాజ్.. రియల్ హీరోలా మాట్లాడటమే కాదు.. చిన్నమ్మకు చురకలేసే వారూ ఉన్నారన్న భావనను కలిగించటంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

ఇంతకీ.. ఆయన ఏమన్నారు? చిన్నమ్మకు ఆయన వేసిన చురకలేందన్నది చూస్తే.. ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాలు ముగియక ముందే శశికళ నాయకత్వం వహించాలనే డిమాండ్లు తెర మీదకు రావటం బాధాకరమని.. ఈ విషయంలో తొందరపాటు ప్రదర్శించాల్సిన అవసరం లేదన్నమాటను చెప్పిన ఆనంద్ రాజ్.. ‘‘శశికళ తొందరపాటు చూపిస్తున్నారన్న ప్రశ్న సామాన్యులందరిలో నెలకొంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టేందుకు తొందరపాటుతో వ్యవహరించాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె మీద పలు వ్యతిరేకతలు కావటానికి ఇదో కారణం. తొందరపాటుతో పలు ప్రశ్నలు వస్తున్నాయి. అంతా మీ అధీనంలోనే ఉంది. ఎవరూ లాగేసుకోలేరు. నిదానంగా కార్యాచరణలోకి దిగండి’’ అని అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొనటం ఇప్పుడు సంచలనంగా మారింది.

అమ్మ మరణం మీద సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మీద అపోలో ఆసుపత్రి యంత్రాంగం వైద్యపరంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఆయన.. జయలలితను చూసేందుకు వచ్చిన ఆమె మేనకోడలు దీపను అనుమతించలేదన్న విషయం తనకు తెలీదన్నారు. శశికళ నాయకత్వాన్ని కోరుకుంటున్న వారి అభిప్రాయాలన్నీ వ్యక్తిగతమని.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎవరున్నా కార్యకర్తగా పని చేస్తానని చెప్పిన ఆయన.. తాను పార్టీ నుంచి వైదొలగలేదన్నారు. జయలలిత వీలునామా రాశారా? లేదా? అన్న విషయం తనకు తెలీదన్న ఆనంద్ రాజ్.. జయలలిత నివాసాన్ని స్మారకంగా మార్చాలని.. ఆమె విగ్రహాన్ని పెట్టించి.. మూడు పూటలా పూజలు జరిగే ఆలయంగా మార్చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News