ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరెత్తితేనే టీడీపీ భగ్గుమంటోంది. ఆయనకు వీలైనంతగా నిరసన తెలపాలని చూస్తూ ఇందుకోసం అవకాశాన్ని వాడుకుంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ లోని మాండ్లా జిల్లా రాంనగర్ లో నిర్వహించిన నేషనల్ పంచాయతీరాజ్ సమ్మేళన్ లో ప్రధాని మోడీ మాట్లాడుతుండగా...ఆయన ప్రసారాన్ని లైవ్ టెలీకాస్ట్ చేస్తుండగా టీడీపీ నేతలు దీన్ని అడ్డుకున్నారు. తమ పార్టీ చరంగు అయిన పచ్చ గుడ్డలు కప్పి నిరసన తెలిపారు. ఇది జరిగింది అనంతపురం జిల్లా పరిషత్ సమావేశం సందర్భంగా.
జెడ్పీ సర్వసభ్య సమావేశం సందర్బంగా ప్రదాని మోడీ ప్రసంగాన్ని లైవ్ టెలీకాస్ట్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రసారాలు కొనసాగుతుండగా అధికార టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మంత్రి పరిటాల సునీత సహామిగతా నేతలు ఈ ప్రసారాన్ని నిలిపివేయాలని అధికారులను కోరుతూ స్క్రీన్ ఫై పసుపుగుడ్డలు కప్పారు. ‘ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు’ అంటూ నినాదాలు చేశారు. మోడీ ప్రసంగం సాగుతున్నంత సేపు నిరసలతో సభ దద్దరిల్లింది. అధికారులు మాత్రం ప్రసంగాన్ని పూర్తిగా ప్రసారం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రొజెక్టరుకు అడ్డుగా నిలిచి నినాదాలు చేశారు. ప్రధాని రాష్ట్రానికి మోసం చేశారని ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ డౌన్ డౌన్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఏపీలో ప్రత్యేకహోదా పోరు ఉధృతం అయింది. కేంద్రం దిగివచ్చేవరకు ఉద్యమం ఆగదన్న భావాన్ని తెలిపేందుకు లెఫ్ట్ పార్టీలు - విపక్షాలు వివిధ రూపాల్లో ఆందోళనకు దిగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా బిజిలీ బంద్ నిర్వహించారు. ప్రత్యేకహోదా సాధన సమితి పిలుపుమేరకు విపక్షపార్టీలు బిజిలీ బంద్‌కు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. వామపక్షాల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 నుంచి అరగంట పాటు ప్రజలు లైట్లు ఆపేసి నిరసన తెలిపారు. వ్యాపారసంస్థలు స్వచ్చందంగా బిజిలీ బంద్‌లో పాల్గొని.. మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలపై నిరసన ప్రకటించారు. ఇప్పటికైన నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.