ఢిల్లీలో గ‌ణ‌తంత్ర వేడుక‌లు..ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా తెలుగు రాష్ట్రాలు

Update: 2020-01-26 11:15 GMT
71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ‌వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ పథ్‌ వద్ద ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియాస్‌ బొల్సోనారో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్‌ వేడుకల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు - ప్రధాని నరేంద్ర మోదీ - పలువురు కేంద్ర మంత్రులు - ప్రతిపక్షాల నాయకులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఢిల్లీ వేదికగా మరోసారి తెలుగు రాష్ట్రాలు త‌మ స‌త్తా చాటాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ వద్ద నిర్వహించిన పరేడ్‌ లో తెలంగాణ శకటం - ఏపీ శ‌క‌టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆరు సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏపీ శకటానికి గణతంత్ర దినోత్సవం వేడుకల్లో చోటు దక్కింది. ఈ సంద‌ర్భంగా ఏపీ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. ప‌విత్ర  పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవానికి సంబంధించిన థీమ్‌ తో రూపొందించిన శకటంలో శ్రీవారి ఆనంద నిలయం - బ్రహ్మోత్సవ ఊరేగింపు.. ఇలా ప్రత్యేక ఆకర్షణలతో తీర్చిదిద్దారు. వీటితో పాటుగా కూచిపూడి నృత్య ప్రదర్శన - కొండపల్లి హస్తకళలలను ఈ శకటంపై ప్రదర్శించారు. ఈ శ‌క‌టం అనేక‌మందిని ఆక‌ట్టుకుంది.

కాగా, తెలంగాణ రాష్ట్రం సిద్దించాక 2015 లో తొలిసారి తెలంగాణ తరఫున శకటం ప్రదర్శించే అవకాశం రాష్ట్రానికి దక్కింది. మ‌ళ్లీ ఐదేళ‌క్ల‌ తర్వాత మరోసారి తెలంగాణ శకటం ప్రదర్శించబడింది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ పండుగ, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర - వేయి స్తంభాల గుడి థీమ్‌తో రూపొందించిన ఈ శకటం.. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. గిరిజన కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను  చాటి చెప్పేలా.. గొండి - తోటి - ప్రదాన్‌ - కొమ్ముకోయ - బంజారా కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇదిలాఉండ‌గా, ఈ వేడుకలకు త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ - ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణే - నేవీ చీఫ్‌ అడ్మైరల్‌ కరంబీర్‌ సింగ్‌ - ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌ కేఎస్‌ భదురియా హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాజ్‌ పథ్‌ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది పోలీసులు - పారా మిలటరీ దళాలు మోహరించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
 
Tags:    

Similar News