సిగ్గులేక‌పోతే స‌రి.. సీడీల‌తో ప్ర‌చార‌మ‌ట‌

Update: 2018-02-19 05:17 GMT
చేసింది ఏమీ లేకున్నా.. చాలా చేసేశామంటూ ఏపీ ప్ర‌జ‌ల చెవిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. ఏపీకి అంత చేస్తాం.. ఇంత చేస్తామ‌ని చెప్ప‌ట‌మే కాదు.. దేశ రాజ‌ధాని ఢిల్లీని త‌ల‌పించేలా అమ‌రావ‌తి న‌గ‌రాన్ని తీర్చిదిద్దుతాన‌ని మోడీ త‌న నోటితో తాను చెప్పిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అధికారం చేతికి వ‌చ్చాక ఇచ్చిన హామీలు.. చేసిన బాస‌ల్ని మ‌ర్చిపోతున్న క‌మ‌ల‌నాథులు.. బ‌రి తెగింపు  వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఏపీకి న్యాయంగా ఇవ్వాల్సిన‌వి ఇప్ప‌టివ‌ర‌కూ ఇవ్వ‌ని వారు.. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. అదేమంటే.. అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి ఏపీకి చాలానే చేస్తున్నామంటూ బుకాయింపు మాట‌ల్ని చెబుతున్నారు.

ఏపీకి ఏమిచ్చార‌న్న‌ప్పుడు చిట్టా చ‌దివేస్తున్న ఏపీ బీజేపీ నేత‌లు వారు.. అలాంటివ‌న్నీ మిగిలిన రాష్ట్రాల‌కు ఇచ్చేవ‌న్న విష‌యాన్ని మాత్రం దాచేస్తున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న హామీల‌న్నీ వ‌దిలేసినా.. పైపైన అంద‌రికి తెలిసిన ప్ర‌త్యేక హోదా.. పోల‌వ‌రం.. రైల్వే జోన్ ఏర్పాటు లాంటి వాటిలో ఏ ఒక్క‌టికి ఇప్ప‌టికీ అమ‌లు కాలేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడే.. ఏదో ఒక మాట చెప్పేసి కాలం గ‌డిపేస్తున్న బీజేపీ నేత‌లు.. విశాఖ రైల్వే జోన్ ఇష్యూ కేంద్రం ప‌రిశీల‌న‌లో ఉంద‌ని చెబుతారు. అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇప్ప‌టికి ప‌రిశీల‌న‌లో ఉండ‌టం ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌. ఈ ర‌కంగా చూస్తే.. వ‌చ్చే యాభై ఏళ్ల‌లో కూడా ఏపీకి జ‌రిగిన విభ‌జ‌న అన్యాయం స‌రి చేసే ప‌రిస్థితి ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

కోరుకోకున్నా శిక్ష వేసిన యూపీఏ స‌ర్కారు ఏపీ ప్ర‌జ‌ల్ని ఒక‌లా వేధిస్తే.. ఆ బాధ‌ల్ని తీరుస్తాం.. ఆ వెత‌ల్ని ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పి మ‌రీ అధికారంలోకి వ‌చ్చిన మోడీ స‌ర్కారు సైతం ఏపీ ప్ర‌జ‌లకు ఏమీ చేయ‌కుండా నిర్ల‌క్ష్యంతో వ్య‌వ‌హ‌రిస్తోంది. జైట్లీ బ‌డ్జెట్ లో ఏపీ ప్ర‌యోజ‌నాన్ని కాపాడే ఏ ఓక్క హామీ లేని వేళ‌.. ఏపీలోని పార్టీల‌న్నీ మోడీపై దునుమాడుతున్న వేళ‌.. ఆయ‌న‌కు ర‌క్ష‌గా ఉండేందుకు ఏపీ బీజేపీ నేత‌ల బ‌రితెగింపు తారాస్థాయికి చేరుకుంది.

ఓప‌క్క రాజీనామాలు చేస్తామ‌ని.. అవిశ్వాసం పెడ‌తామ‌ని ఏపీలోని అధికార‌.. విప‌క్ష పార్టీలు చెబుతున్న వేళ‌.. క‌మ‌ల‌నాథులు మాత్రం అందుకు భిన్నంగా ఏపీకి మోడీ స‌ర్కారు ఏమేం చేసిందో చెప్పేలా సీడీ యాత్ర చేస్తామ‌ని చెబుతున్నారు.

ఏపీకి కేంద్రం చాలా చేసింద‌ని.. ఆ విష‌యాన్ని ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌టానికి త్వ‌ర‌లోనే త‌మ సీడీ యాత్ర షురూ చేస్తామంటూ ఏపీ బీజేపీ డిసైడ్ చేసింది. గ‌డిచిన నాలుగేళ్ల‌లో ఏపీ అధికార‌ప‌క్షం.. త‌మ మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ చేసిన అన్యాయాల్ని ప్ర‌జ‌ల‌కు చెబుతామ‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే.. ఏపీకి అన్యాయం చేసి సిగ్గు లేకుండా ఊళ్లు తిర‌గ‌టానికి వ‌చ్చే క‌మ‌ల‌నాథుల‌కు త‌గిన‌ట్లుగా స‌త్కారం చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

ఏపీ ప్ర‌జ‌లేమీ సిగ్గు లేకుండా లేర‌ని.. వారి ఒంట్లో పౌరుష‌మైన నెత్తురు ఉంద‌ని.. త‌మ‌ను మోసం చేసే వారికి స‌మాధి క‌ట్టి అంత‌కంత‌కూ బ‌దులు తీర్చుకునే త‌త్త్వం ఉంద‌న్న విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికే విభ‌జ‌న మోసానికి త‌మ తీర్పు చెప్పిన ఏపీ ప్ర‌జ‌లు.. క‌మ‌ల‌నాథుల‌కు కూడా తెలిసి వ‌చ్చేలా చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News