బీజేపీ ప్ర‌తి వ్యూహం!.. బాబుకు చిక్కులేనా?

Update: 2018-02-09 04:48 GMT
మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్ లో న‌రేంద్ర మోదీ స‌ర్కారు.. క‌ష్టాల్లో ఉన్న న‌వ్యాంధ్ర‌ను ఏమాత్రం ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్న వాద‌న‌తో ఇప్పుడు ఏపీ ర‌గిలిపోతోంద‌ని చెప్పాలి. మిత్ర‌ప‌క్షం టీడీపీ పాల‌న‌లోనే ఉన్న ఏపీని ప‌ట్టించుకునే విష‌యంలో బీజేపీ స‌ర్కారు ఎందుకంత నిర్లక్ష్యంగా వ్య‌వ‌హరిస్తోంద‌న్న విష‌యం ఇప్పుడు నిజంగానే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగులుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల మేర‌కు అన్ని అంశాల్లో ఏపీకి స‌హ‌కారం అందిస్తూనే ఉన్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్న న‌రేంద్ర మోదీ స‌ర్కారు... ఆ విష‌యాన్ని పార్ల‌మెంటు సాక్షిగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టుగా ఎందుకు చెప్ప‌డం లేద‌న్న ప్ర‌శ్న కూడా ఇప్పుడు బ‌లంగానే వినిపిస్తోంది. నెర‌వేర్చిన హామీల‌ను పార్ల‌మెంటుకు చెప్ప‌డంతో పాటుగా ఇంకేం చేయాల‌న్న విష‌యాల‌ను కూడా కాస్తంత వివ‌రంగానే చెబితే... ఏపీ ఎంపీల నిర‌స‌న‌ల‌తో రోజుల త‌ర‌బ‌డి పార్ల‌మెంటు స‌మావేశాలు స్తంభించాల్సిన అవ‌స‌రం లేదు క‌దా.

అయితే ఆ విష‌యాన్ని మ‌రిచిన బీజేపీ స‌ర్కారు... ఏపీకి ఇప్ప‌టికే చాలా చేశాం... ఇంకా చేయాల్సింది ఉంది. కొంత‌మేర చ‌ర్య‌ల‌ను ఇప్ప‌టికే ప్రారంభించాం. మ‌రిన్ని అంశాలకు సంబంధించి ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయన్న వాద‌న‌ను వినిపిస్తోంది. ఇక ఇదే పాత మాట‌ను వల్లె వేస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ... అస‌లు ఇప్ప‌టిదాకా ఏపీకి ఎంత‌మేర నిధులిచ్చామ‌న్న పూర్తి స్థాయి గ‌ణాంకాల‌ను విడుద‌ల చేస్తే ఎలాంటి గోలా లేదు క‌దా అన్న ప్ర‌శ్న కూడా ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది. ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌మాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్య‌త ఉన్న టీడీపీ స‌ర్కారు.. ఇప్ప‌టిదాకా కేంద్రం ఇచ్చింది కేవ‌లం మెతుకులేన‌ని, ఆ మెతుకుల‌తోనే క‌డుపు నిండాలంటే ఎలాగంటూ ప్ర‌తి వాద‌న చేస్తోంది. మొన్న‌ట బ‌డ్జెట్‌లో ఏపీ మాట వినిపించ‌లేద‌న్న ఒకే ఒక్క అంశాన్ని ఆస‌రా చేసుకుని ఏపీకి చెందిన పార్టీల‌న్నీ కూడా ఇప్పుడు ఢిల్లీ వేదిక‌గా పార్ల‌మెంటులో నిర‌స‌నల హోరును వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో గ‌డ‌చిన నాలుగు రోజులుగా పార్ల‌మెంటు స‌మావేశాలు స‌జావుగా సాగిన దాఖ‌లానే లేదు. సాక్షాత్తు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మాట్లాడుతున్న‌ప్పుడు కూడా పార్ల‌మెంటులో గ‌లాభా జ‌రిగిందంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థం కాక మాన‌దు. మిత్ర‌ప‌క్షంగానే ఉన్నా బీజేపీని... ఏపీకి నిధులివ్వ‌లేద‌న్న కార‌ణంగా టీడీపీ ఇరుకున పెట్టేస్తోంది. మిత్ర‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వమే కేంద్రంలో ఉంద‌ని, రాష్ట్రానికి న్యాయం జ‌రిగి తీరుతుంద‌న్న న‌మ్మ‌కం మొన్న‌టిదాకా ఉండేద‌ని, అయితే మొన్న‌టి బ‌డ్జెట్‌ను చూసిన త‌ర్వాత ఆ న‌మ్మ‌కం కూడా పోయింద‌ని టీడీపీ వాదిస్తోంది.

అస‌లు ఏపీకి కేంద్రం ఇప్ప‌టిదాకా ఇచ్చిన నిదులు ఏ మూల‌కు స‌రిపోతాయ‌న్న కోణంలో టీడీపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుత‌న్న వైనంతో బీజేపీ స‌ర్కారు నిజంగానే ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంటోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే ఆ ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని మ‌రింత కాలం పాటు కొన‌సాగించుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లుగా ఇప్పుడు కొత్త త‌ర‌హా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. టీడీపీ స‌ర్కారు చెబుతున్న దానిలో వాస్త‌వాలు లేవ‌న్న కోణంలో కొత్త వాద‌న‌ను తెర‌పైకి తీసుకొని వ‌స్తున్న ఏపీకి చెందిన బీజేపీ నేత‌లు... టీడీపీపైకి ఎదురు దాడి చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లుగా తెలుస్తోంది. ఈ మేర‌కు నేడు ఢిల్లీకి వెళ్ల‌నున్న ఏపీ బీజేపీ నేత‌లు ఢిల్లీలోనే ఓ ప్ర‌త్యేక మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని, ఆ స‌మావేశంలో ఏపీకి ఇప్ప‌టిదాకా బీజేపీ స‌ర్కారు ఏ మేరకు నిధులిచ్చామ‌న్న విష‌యాన్ని క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌ గా చెబుతార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజ‌మైతే... టీడీపీ వాయిస్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి టీడీపీ చేస్తున్న వాద‌న‌ను తిప్పికొట్టేందుకు ఢిల్లీ వెళుతున్న ఏపీ బీజేపీ నేత‌లు ఏ మేర‌కు రాణిస్తారో చూడాలి. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?

Tags:    

Similar News