అమరావతికి అన్ని వేల అటవీ భూమి కావాలా బాబు?

Update: 2016-04-03 05:09 GMT
తాజాగా ఏపీ సర్కారు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అవసరాల కోసం ఏపీ సర్కారు కోరనున్న భూమి లెక్క ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజధాని కోసం దాదాపు 35వేల ఎకరాలకు పైనే రైతుల నుంచి భూమిని సేకరించే లక్ష్యం పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేయటం తెలిసిందే. దీంతో.. రాజధాని అవసరాలకు భూమి లెక్క పూర్తి అయినట్లేనని భావించారు. దీనికి భిన్నంగా తాజా మంత్రివర్గ సమావేశంలో మరో 33వేల ఎకరాల భూమి అవసరమంటూ లెక్క తేల్చటంతో పాటు.. సదరు భూమి అటవీ ప్రాంతంలో ఉందని.. దాన్ని రాజధాని అవసరాలకు తగినట్లుగా వినియోగించుకునే వీలు కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయటం ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి విభజన నేపథ్యంలో ఏపీ రాజధానిని ఎక్కడ నిర్మించాలన్న చర్చ జరిగినప్పుడు.. అమరావతి ప్రాంతంలో ఉన్న అటవీ భూముల్లో రాజధానిని ఏర్పాటు చేయాలని.. అలా చేస్తే భూవివాదాలు తలెత్తవని.. అటవీశాఖ నుంచి అనుమతుల్ని సాధించుకోవటం తప్ప మరెలాంటి తలనొప్పులు ఉండవని చంద్రబాబు చెప్పే వారని చెబుతారు. ఇలాంటి మాటలు చెప్పిన చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాలను రైతుల నుంచి సేకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. వేళ్ల మీద లెక్క పెట్టే గ్రామాలు మాత్రమే ప్రభుత్వ భూసేకరణను వ్యతిరేకించాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన క్యాబినెట్ లో భారీ ఎత్తున అటవీ భూమిని రాజధాని అవసరాల కోసం కేటాయించాలంటూ చంద్రబాబు సర్కారు కొత్త చర్చను తెర మీద తీసుకురావటం ఆసక్తికరంగా మారింది. ఈ భూములు కానీ తమకు ఇచ్చేందుకు ఓకే అంటే కేంద్ర పర్యావరణ.. అటవీ మంత్రిత్వ శాఖకు రూ.1357 కోట్లు ఇచ్చేందుకు బాబుక్యాబినెట్ పచ్చజెండా ఊపేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 35 వేల ఎకరాలకు పైనే ఉన్న భూమి సరిపోదంటూ మరో 33వేల ఎకరాల అటవీ భూమి అవసరమన్న వాదనపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.  ఏమైనా ఇంత భారీ ఎత్తున భూముల కోసం బాబు సర్కారు ప్రయత్నాలు షురూ చేయటం మరిన్ని ఆరోపణలకు అవకాశం ఇస్తుందనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News