నేడు ఏసీబీ ఔట్‌!... రేపు ఆ పోస్టు కూడానా?

Update: 2019-04-04 16:54 GMT
ఏపీలో కీల‌క ఎన్నిక‌ల వేళ‌... ఏపీలో అధికార యంత్రాంగంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఎన్నిక‌ల్లో కీల‌క స్థానాల్లో ఉన్న పోలీసు ఉన్న‌తాధికారులు అధికార పార్టీ టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని - వారిని ప‌క్క‌కు పెట్ట‌క‌పోతే... ఎన్నిక‌లు నిష్ప‌క్ష‌పాతంగా జ‌రిగే అవ‌కాశాలు లేవ‌ని విప‌క్ష వైసీపీ నేత‌లు... ఈసీకి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేరుగా ఢిల్లీకి వెళ్లి ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తో పాటు ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు - ఇంటెలిజెన్స్‌ లో కీల‌క స్థానంలో ఘ‌ట్ట‌మ‌నేని శ్రీ‌నివాస్‌ ల‌పై ఫిర్యాదు చేయ‌డంతో పాటు వారిని త‌క్ష‌ణ‌మే బ‌దిలీ చేయాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాత కూడా వైసీపీ నేత‌లు ఈసీకి ఫిర్యాదులు చేస్తూనే వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో మొన్న‌టికి మొన్న ఏబీని బ‌దిలీ చేసేసిన ఈసీ... చంద్ర‌బాబు సర్కారుకు షాకిచ్చింద‌నే చెప్పాలి. అయితే ఈసీ ఆదేశాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లుగా క‌ల‌రింగ్ ఇస్తూనే... టీడీపీ స‌ర్కారు ఎదురు తిరిగింది. అయితే హైకోర్టు మొట్టికాయ‌ల‌తో వెనక్కు త‌గ్గ‌క త‌ప్ప‌లేదు.

ఈ క్ర‌మంలో త‌మ ముందు హాజ‌రుకావాలంటూ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ కు ఈసీ నుంచి ఆదేశాలు అందిన విష‌యం పెను క‌ల‌క‌ల‌మే రేపింది. ఈసీ పిలుపుతో ఠాకూర్ బ‌దిలీ కూడా త‌ప్ప‌ద‌న్న విశ్లేష‌ణ‌లూ సాగాయి. ఈ క్ర‌మంలో భ‌యంభ‌యంగానే నేటి ఉద‌యం ఢిల్లీ ఫ్లైటెక్కిన ఠాకూర్‌... ఈసీ ముందు హాజ‌ర‌య్యారు. ఏబీ బ‌దిలీ విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఠాకూర్‌ ను ఈసీ వివ‌ర‌ణ అడిగిన‌ట్టుగా స‌మాచారం. అంతేకాకుండా డీజీపీగా ఉంటూ ఏసీబీ వ్య‌వ‌హారాల‌ను కూడా ఎలా ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని ఈసీ ఠాకూర్‌ ను ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. అయితే ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఆధారంగానే తాను జోడు ప‌ద‌వుల్లో కొన‌సాగుతున్నాన‌ని ఠాకూర్ బ‌దులిచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే నేటితో కొంత‌మేర వివ‌రాలు సేక‌రించిన ఈసీ... రేపు కూడా త‌మ ముందు హాజ‌రుకావాల్సిందేన‌ని ఠాకూర్‌ను ఆదేశించింది. దీంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఠాకూర్ నుంచి వివ‌రాలు తెలుసుకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న‌ప‌ళంగా ఠాకూర్‌ ను ఏసీబీ చీఫ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తూ ఆగ‌మేఘాల మీద ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అంతేకాకుండా ఏసీబీ చీప్‌ గా మ‌రో సీనియ‌ర్ ఐపీఎస్ శంక‌భ్ర‌త బాగ్చీని నియ‌మిస్తున్న‌ట్లు కూడా ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఈసీ విచార‌ణ సంద‌ర్భంగా ఠాకూర్‌ కు బాగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌య్యాయ‌ని, ఈ క్ర‌మంలోనే ఈసీ నుంచి ఆదేశాలు రాక‌ముందే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మేల్కొంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... తొలి రోజు విచార‌ణ‌లో ఎదురైన ప‌రిణామాల‌తోనే ఠాకూర్ చేతిలో నుంచి ఏసీబీ చీఫ్ బాధ్య‌త‌లు తొల‌గిపోతే... రేప‌టి విచార‌ణ‌లో ఏకంగా డీజీపీ ప‌ద‌వి కూడా జారిపోతుందా? అన్న కోణంలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది. అయినా రాష్ట్రంలోని తాజా ప‌రిస్థితుల‌పైనే వివ‌రాలు సేక‌రించాల‌నుకుంటే... ఒక్క‌రోజు విచార‌ణ‌తోనే ఈసీ విష‌యాన్ని క్లోజ్ చేసేద‌ని - అలా కాకుండా రెండో రోజు కూడా త‌మ ముందు హాజ‌రుకావాల‌ని ఠాకూర్‌ ను ఆదేశించిందంటే... కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకునే అవ‌కాశాలే అధికంగా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News