పులివెందులలో ప్రజా దర్బార్...జగన్ కి కొత్త సంకేతాలు
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త ఏడాది సరికొత్తగా రాజకీయ అడుగులు వేసేందుకు సిద్ధపడుతున్నారు.
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త ఏడాది సరికొత్తగా రాజకీయ అడుగులు వేసేందుకు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగా ఆయన సొంత జిల్లా నుంచే యాక్షన్ ప్లాన్ కి శ్రీకారం చుడుతున్నారు. నాలుగు రోజుల పర్యటనకు జగన్ కడప జిల్లా పులివెందులకు వచ్చారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలలో జగన్ పాలు పంచుకున్నారు.
ఆ తరువాత ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే ఈ ప్రజాదర్బార్ కి వచ్చిన జనాలలో అత్యధిక శాతం జగన్ ని చూసేందుకే రావడం విశేషం. కేవలం కడప జిల్లాకు చెందిన వారు మాత్రమే కాకుండా రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి జగన్ కోసం వచ్చిన వారితో ప్రజా దర్బార్ కిటకిటలాడింది.
ఆ విధంగా చూసుకుంటే జగన్ నిర్వహించిన ప్రజా దర్బార్ కి అనూహ్య స్పందన లభించింది అని అంటున్నారు. జగన్ సైతం ఓపికగా వచ్చిన వారి సమస్యలు వింటూ చాలా మందితో మాట్లాడుతూ కనిపించారు. ఇక స్థానికంగా ఉన్న సమస్యల మీద ఆయన వారికి పరిష్కారం అందిస్తామని భరోసా కూడా ఇచ్చారు.
జగన్ ని చూసేందుకు ఎక్కువ మంది వచ్చామని చెప్పడం విశేషం. మరి జగన్ ని ఎందుకు చూడాలని అనుకుంటున్నారు అంటే ఆయన గత అయిదేళ్లుగా జనంలోకి రాలేదని విమర్శలు ఉన్నాయి. ఆయన సీఎం కాగానే తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకే పరిమితం అయిపోయారు అని అంటున్నారు.
గతంలో జగన్ అయితే జనంలోనే ఉండేవారు. ఆయన జనం నుంచే అలా సీఎం సీటు దాకా వెళ్లారు. కానీ సీఎం అయిన తరువాత మళ్లీ జనం వైపుగా రాలేదని అంటున్నారు. అంతే కాదు ఆయన బహిరంగ సభలు నిర్వహించినా పరదాలు కట్టేసి ఆంక్షలను అధికారులు పెట్టారని కూడా గుర్తు చేసుకుంటున్నారు
ఇక పులివెందుల ప్రజా దర్బార్ జగన్ తో పాటు వైసీపీ నేతలకు కొత్త జోష్ ని నింపింది అని అంటున్నారు. జగన్ మాస్ లీడర్ గా ఉన్నారని మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. అంతే కాదు జనాలు జగన్ నుంచి ఏమి ఆశిస్తున్నారో కూడా అర్ధం అయింది అంటున్నారు.
జగన్ తరచూ జనంలోకి రావడం ద్వారా వారితో మమేకం అయితే చాలు అన్నది ఎక్కువ మందిలో కనిపిస్తున్న విషయంగా ఉంది అని అంటున్నారు. ఆ విధంగా ప్రజా దర్బార్ జగన్ తో పాటు వైసీపీ నేతలకు కొత్త సంకేతాలు ఇచ్చిందని అంటున్నారు.
మరో వైపు చూస్తే జనవరి చివరి వారం నుంచి జగన్ జనంలోకి రానున్నారు. ఆయన వారంలో రెండు రోజుల పాటు ఆయా జిల్లాల క్యాడర్ తో ప్రత్యేకంగా సమావేశం అవుతారు అని చెబుతున్నారు. పార్టీని గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకుని పోవాలని పటిష్టం చేయాలని తలపోస్తున్నారు. అదే సమయంలో తన పర్యటనలో సామాన్య జనాలను దగ్గరకు తీయాలని చూస్తున్నారు. దానికి నాందిగా ప్రజా దర్బార్ ఉపయోగపడుతోంది అంటున్నారు.
ఇదే తీరున మరిన్ని ప్రజా దర్బార్ లను కూడా జగన్ నిర్వహించాల్సి ఉంటుందని అంటున్నారు. ఏ నాయకుడు అయినా ప్రజలతో ఉంటేనే వారి మనోభావాలు తెలుస్తాయని దానికి అనుగుణంగా పార్టీని చక్కదిద్దుకోవచ్చు అని అంటున్నారు. వైసీపీ కొత్త ఏడాదిలో తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుంటోంది. మరి జగన్ టూర్లు ఏ విధంగా జనాలకు ఆయనను దగ్గరకు చేస్తాయో చూడాల్సిందే అంటున్నారు. అంతే కాదు వైసీపీకి 2024 చేదు అనుభవాలు ఇచ్చింది. 2025 ఏ రకమైన ఆశలు కల్పిస్తుందో చూడాల్సి ఉంది అంటున్నారు.