రాజ‌ధాని భూస‌మీక‌ర‌ణ పూర్తికాలేదా?

Update: 2016-03-22 07:22 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి కావాల్సిన 33 వేల ఎకరాల భూమి స‌మీక‌ర‌ణ పూర్తికాలేదా?  రాజ‌ధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పదేపదే చెపుతున్నప్ప‌టికీ వాస్తవానికి అంత భూమి ప్రభుత్వం చేతికి అందలేదా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

అమ‌రావ‌తి పరిధిలోకి వ‌చ్చే తాడేపల్లి మండలంలోని ఉండవల్లి - పెనుమాక గ్రామాలకు చెందిన అధిక శాతం రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడక కోర్టులను ఆశ్రయించారు. ఇలా ఇప్పటికే సుమారు 500లకు పైగా కేసులు కోర్టుల్లో ఉన్నాయి. దీంతోపాటు మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం - బేతపూడి గ్రామాల్లోని రైతులు కూడా భూములు ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే 177 ఎకరాలకు సంబంధించి భూ సేకరణ నోటిఫికేషన్‌ ను ప్ర‌భుత్వం జారీ చేసింది. భూ సమీకరణ కన్నా భూసేకరణతో ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ప్రచారం జరగడంతో ఇప్పటికే భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులు కూడా వాటిని వెనక్కు తీసుకుని భూసేకరణకు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో రాజధాని భూముల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మ‌రోవైపు రాజ‌ధాని రైతుల్లో కొత్త గంద‌ర‌గోళం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాక‌పోవ‌డంతో రైతులు ఎదురుచూడటం వారిని నిరాశ‌కు గురిచేస్తోంది. దీంతోపాటు రాజధాని కోసం భూములను సేకరించే స‌మ‌యంలో వ‌చ్చిన డిమాండ్ విష‌యంలో చాలామంది రైతులు ధ‌ర‌ల విష‌యంలో ఆశ‌ప‌డ్డారు. అయితే అప్పుడు ఊహించినంత గొప్పగా భూముల ధరలు పెరగలేదు. కొన్నిచోట్ల పెరిగినా, కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో రాజధాని ప్రాంతాల్లో ఇపుడు ఒకింత స్త‌బ్ద‌త నెల‌కొంద‌ని స‌మాచారం.
Tags:    

Similar News