ఏపీలో కొత్త‌ శాఖ‌ల అడ్ర‌స్ ఇదే...

Update: 2015-09-16 08:51 GMT
విజయవాడ కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతినిత్యం సమీక్షా సమావేశాలతో అధికార యంత్రాంగాన్ని ఉరక లెత్తిస్తుండడంతో ఉన్నతాధికారులు కూడా దాదాపు అక్కడే గడుపుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం రోజురోజుకూ బోసిపోతోంది. ముఖ్యమంత్రి రాకపోవడంతో పాటు మంత్రులు కూడా ఉండక పోవడంతో ఏ కార్యాలయంలోనూ సందర్శకులు కానరావడంలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతో పాటు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శుల కార్యా లయాలన్నీ కిందిస్థాయి ఉద్యోగులతోనే నామమాత్రపు విధులు సాగిస్తున్నాయి. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో హైదరాబాద్‌ నగరాన్ని పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నప్పటికీ, పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని ప్రధాన శాఖలను, శాఖాధిపతుల కార్యాల యాలను ఏపీ భూభాగానికి తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

దసరా పర్వదినాన తలపెట్టిన అమరావతి శంకు స్థాపన కార్యక్రమం నాటికి పురపాలక పట్టణాభివృద్ధి - సాగునీటి పారుదల - వ్యవసాయ అనుబంధ రంగాల శాఖలను - సంబంధిత హెచ్‌ వోడీలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శాఖల కార్యాలయాల్లోని పలు కీలక ఫైళ్ళను ఇప్పటికే తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. ఏడాదిలోగా మొత్తం శాఖలను తరలించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకు సంబంధించి ముగ్గురు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులతో నియమించబడిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు శాఖల తరలింపునకు ముఖ్యమంత్రి నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చారు.

అనధికారికంగా అందిన సమాచారం మేరకు కృష్ణా జిల్లా గన్నవరం కేంద్రంగా వ్యవసాయం, అనుబంధ శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కేంద్రంగా మత్స్యశాఖను నెలకొల్పబోతున్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఎంచుకున్న లక్ష్యాలను త్వరితగతిన సాధించేందుకోసం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాక కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన బాధ్యతను గుర్తించి గత నెల రోజుల కాలంగా అక్కడే ఉంటున్న ముఖ్యమంత్రి కొన్ని శాఖలను ముందుగా తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏపీలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు ముందుగా వ్యవసాయశాఖను తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ శాఖలో భాగమైన ఉద్యానవనం - మత్స్యశాఖ - పశు సంవర్ధకశాఖలతో పాటు ప్రాధాన్యత గల సాగునీటి పారుదల శాఖను - రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని పురపాలక - పట్టణాభివృద్ధిశాఖను కూడా తరలించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసుకుంది.

మొత్తంగా హైద‌రాబాద్‌ లో ఏపీ వ్య‌వ‌హారాలు స్త‌బ్దుగా మారుతుండగా... విజ‌య‌వాడ రాజ‌ధాని క‌ళ‌ను వేగంగా సంత‌రించుకుంటోంది.
Tags:    

Similar News